MURDER CASE ACCUSED ARREST: అతడికి జాతకాల పిచ్చి. 30 ఏళ్లైనా పెళ్లి కావట్లేదు. ఆర్థికంగా కూడా ఎదకలేకపోతున్నాడు. దీంతో కనిపించిన సాధువులు, స్వాములను కలిసి జాతకం చెప్పించుకునేవాడు. అయితే అతడి పక్కింటి వాళ్లే అతడిపై చేతబడి చేసి ఎదగకుండా చేస్తున్నారని వారు చెప్పారు. దీంతో సొంత బాబాయ్ కుటుంబమే తనపై చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో.. వారిపై రాళ్లతో క్రూరంగా దాడి చేసి హతమార్చాడో వ్యక్తి. ఈ దారుణమైన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొత్తపల్లి గ్రామంలో ఏడు నెలల క్రితం చోటుచేసుకుంది. అయితే ఘటనానంతరం ఏడు నెలలుగా పరారీలో ఉన్న నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. దీంతో హత్యల వెనకు ఉన్న అసలు విషయం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన కుక్క మల్లికార్జున అనే వ్యక్తికి జాతకాల పిచ్చి ఉంది. 30 ఏళ్లైనా తనకు పెళ్లి కాకపోవడం, ఆర్థికంగా ఎదగలేక పోవటం వంటి అంశాలపై దారిన పోతున్న స్వాములను, సాధువులను కలిసి మల్లికార్జున అడిగేవాడు. అయితే మీ పక్కింటి వారే మీరు ఎదగకుండా చేతబడి చేస్తున్నారని ఆ సాధువులు, స్వాములు అతడితో చెప్పారు. వారి మాటలను నమ్మిన మల్లికార్జున తన పక్కింట్లో జీవిస్తున్న అతడి బాబాయి కుటుంబంతో గత కొద్ది కాలంగా మనస్పర్ధలు రావడంతో వారే తనను ఎదగకుండా చేస్తున్నారని భావించాడు. దీంతో సొంత బాబాయ్ కుటుంబంపై 12-07-22 తేదీన రాళ్లతో దాడి చేసి క్రూరంగా చంపేశాడు.
ఈ ఘటనలో నిందితుడి పిన్ని ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నిందితుడి బాబాయ్ తిరుమలయ్య, చెల్లెలు స్వప్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. చెల్లెలు స్వప్న నిండు గర్భిణీ అనే జాలి కూడా లేకుండా మల్లికార్జున అత్యంత పాశవికంగా వ్యవహరించి.. రాళ్లు, ఐరన్ రాడ్తో దాడి చేసినట్లుగా విచారణలో వెల్లడైందని సీఐ ఫిరోజ్ తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ దారుణమైన హత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏడు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు.. పోలీసులు తన కోసం ముమ్మరంగా గాలిస్తున్నారన్న విషయం తెలుసుకున్న నిందితుడు భయంతో ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు.
"ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కుక్క మల్లికార్జున అనే వ్యక్తి గతేడాది జూలై 12న తన సొంత బాబాయి కుటుంబంపై రాళ్లతో దాడి చేశాడు. ఎనిమిదో నెల గర్భవతి అని కూడా కనికరం లేకుండా నిందితుడు తన చెల్లెలిపై కూడా క్రూరంగా దాడి చేశాడు. ఈ ఘటనలో నిందితుడి బాబాయ్, పిన్ని, చెల్లెలు కూడా మృతి చెందారు. అయితే అతడికి ఉన్న జాతకాల పిచ్చి ఉంది. 30 ఏళ్లైనా తనకు పెళ్లి కావట్లేదు అనే విషయాలపై కనిపించిన సాధువులను, స్వాములను అడిగేవాడు. అయితే అతడి పక్కింటి వాళ్లే అతడిపై చేతబడి చేస్తున్నారని వారు చెప్పారు. దీంతో ఈ మాటలు మాత్రమే మనసులో పెట్టుకున్న అతడు తన బాబాయ్ కుటుంబమే ఇలా తనపై చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో వారిపై రాళ్లతో దాడి చేసి హత్య చేశాడు."