ప్రకాశం జిల్లాలో భూముల రీ సర్వేకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు కీలకమైన ఏడు బేస్ స్టేషన్ల నిర్మాణ పనులను సర్వే ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన ప్రాంతాల్లో శరవేగంగా కొనసాగిస్తున్నారు. వాటిని మూడు నాలుగు రోజుల్లో పూర్తి చేశాక... శాటిలైట్‌తో అనుసంధానించనున్నారు. జిల్లాలో చినగంజాం, ఉలవపాడు, ముండ్లమూరు, కనిగిరి, యర్రగొండపాలెం, కొమరోలు, కంభంలో బేస్ స్టేషన్లను నెలకొల్పుతున్నారు. వాటిని శాటిలైట్‌తో అనుసంధానం చేయాల్సిన దృష్ట్యా సెల్ టవర్లు, హైటెన్షన్ విద్యుత్ తీగలు, పెద్ద పెద్ద భవనాలు వంటివి దగ్గర్లో లేకుండా చూసుకుని నిర్మిస్తున్నారు. ఒక్కో దానికి 35 చదరపు కిలో మీటరు వైశాల్యంలో సమాచారాన్ని సేకరించే సామర్థ్యం ఉంటుంది.
రెండింటి మధ్య సరాసరి 70 కిలో మీటర్ల దూరం ఉండేలా చూస్తున్నారు. ప్రతి దానిలో ఏర్పాటు చేయబోయే కంటిన్యువస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్(సీిఓఆర్‌ఎస్-కార్స్) అనే సాఫ్ట్‌వేర్ సహకారంతో సర్వే చేపడతారు. హై ఫ్రీక్వెన్సీ డ్రోన్, రోవర్ల సహకారంతో క్షేత్రంలో ఫొటోలు తీసి, కార్స్‌కు అందిస్తారు. కచ్చితమైన ప్రమాణాలతో లెక్కించి సరిహద్దులు నిర్ణయిస్తారు. తొలిదశలో ఎనిమిది నెలల్లో 350 గ్రామాల్లో సర్వే పూర్తికి చర్యలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేశారు. గతంలో సర్వే నిర్వహిస్తే తీవ్ర కాలయాపనతోపాటు సరైన కొలతలు దక్కేవి కావు. ఇప్పుడు వినియోగించనున్న సాంకేతికతతో వేగం, కచ్చితత్వం, పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
నేడు వర్క్‌షాప్..
భూముల రీ సర్వేపై కలెక్టర్ పోలా భాస్కర్ అధ్యక్షతన శనివారం వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమానికి.. సర్వేలో పాల్గొనబోయే సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది హాజరు కానున్నారు. క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు ఎలా పరిష్కరించాలి? వారి అనుమానాలు ఎలా తీర్చాలి అనే విషయాలపై వారికి అవగాహన కల్పిస్తారు.
ఇదీ చదవండి: