MLA ANAM SESATIONAL COMMENTS : రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా రాపూరులో ఏర్పాటు చేసిన వాలంటీర్లు, కన్వీనర్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఆవేదనకు గురయ్యారు. రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నాం.. తాగడానికి నీళ్లు లేవని మండిపడ్డారు. నాలుగేళ్లలో ఏం పని చేశామని.. ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. ప్రాజెక్టులు కట్టమా? పనులు మొదలుపెట్టామా? పింఛన్లు ఇస్తే ఓట్లు వేస్తారా? అలా అయితే గత ప్రభుత్వమూ ఇచ్చిందని విమర్శించారు. ఇల్లు కడతామని లేఅవుట్లు వేసినా ఇప్పటికీ కట్టలేదని మండిపడ్డారు.
"కొత్త రోడ్లు వేయట్లేదు.. గుంతలూ పూడ్చట్లేదు. నాలుగేళ్లలో ఏం చేశామని ప్రజలను ఓట్లు అడుగుతాం. ఎస్‌ఎస్ కెనాల్ కడతామని హామీ ఇచ్చాం. ఇప్పటికీ కెనాల్ గురించి పట్టించుకోలేదు. పింఛన్లు ఒక్కటి ఇస్తే ఎన్నికల్లో గెలుస్తామా?. టీడీపీ కూడా పింఛన్లు ఇచ్చింది.. కాకపోతే మనం పింఛన్లు కొంచెం ఎక్కువ ఇస్తున్నాం"-ఆనం రామనారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే
ప్రజలు నన్ను కూడా నమ్మే పరిస్థితిలో లేరు..: ఎస్ఎస్ కెనాల్ కడతామని ఎన్నికల వేల హామీ ఇచ్చామన్న ఆనం.. మూడున్నరేళ్లయినా కనీసం కెనాల్ గురించి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఎస్‌ఎస్ కెనాల్ గురించి సీఎం జగన్‌కు ఎన్నోసార్లు చెప్పామని.. ఇదే విషయాన్ని అసెంబ్లీలోనూ ప్రస్తావించామన్నారు. ఎస్‌ఎస్ కెనాల్ గురించి చీఫ్ ఇంజినీర్ల భేటీలోనూ కోరాం అయినా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందని మండిపడ్డారు. కంటి ముందు నీళ్లున్నాయని సంతోషపడటమే తప్ప నీళ్లు తాగలేని పరిస్థితి అని ఆందోళన చెందారు. ఇక్కడి నీళ్లు తాగగలమనే ఆత్మవిశ్వాసం ప్రజలకు లేదని విమర్శించారు.
కండలేరు దగ్గరే ఉన్నా రాపూరులో ఒక్క చెరువులో నీళ్లు నింపలేకపోయామని మండిపడ్డారు. కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్‌ఆర్ కలను నెరవేర్చలేకపోయామని.. ఆయన కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామని ధ్వజమెత్తారు. ప్రజలు ప్రస్తుతం నన్ను కూడా నమ్మే పరిస్థితిలో లేరని.. అపనమ్మక వ్యవస్థలో పనిచేస్తున్నామన్నారు. గ్రామాల్లో ప్రజలకు బిందెడు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం అని ఆనం మండిపడ్డారు.
ఇవీ చదవండి: