YSRCP Government Forgot Dugarajapatnam Port Construction : విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం దుగరాజపట్నం పోర్టును కేంద్రం పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించాలని మొదటి దశ పోర్టు నిర్మాణం 2018 నాటికి పూర్తి కావాలని 2016 అక్టోబర్ 25న కర్నూలు యువభేరిలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న జగన్ అన్నారు. PPP విధానంలో నిర్మాణానికి అనుమతించామని అప్పటి కేంద్ర మంత్రి చెప్పారని కేంద్ర నిధులతో పోర్టు నిర్మించాలన్న ప్రతిపాదన పక్కకు పోయిందని ధ్వజమెత్తారు.
విభజన హామీలపై జగన్ ఒక్కడే పోరాడితే సాధ్యం కాదని పోరాటం ద్వారా అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం మనందరికి స్ఫూర్తి కలిగించే అంశమని గుర్తు చేశారు. పార్లమెంటులో చట్టం చేసిన దాన్ని మనం పోరాడి సాధించుకోలేమా అంటూ జగన్ ఆవేశంతో ఊగిపోయారు. మరీ అన్ని మాటలు చెప్పిన జగన్.. ఎన్నికల్లో గెలిచాక ఏం చేశారు?
ఈ నాలుగున్నరేళ్లలో కేంద్రంపై పోరాడారా? దుగరాజపట్నం ఓడరేవును సాధించుకొచ్చారా? పోర్టు నిర్మాణానికి అనుమతులు తీసుకొచ్చేందుకు కనీస ప్రయత్నమైనా చేశారా? సొంత జిల్లా కడపకు ఉక్కు కర్మాగారాన్ని (Steel Plant in Kadapa) తీసుకురాగలిగారా? ఈ రెండు అంశాలూ విభజన చట్టంలో ఉన్నవే. కేంద్రం నుంచి కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదు. అయినా వాటిని సాధించలేకపోయిన జగన్ కేంద్రంతో రాజీ పడి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్టేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సమీప పోర్టుల వల్లే దుగరాజపట్నం సాధ్యం కాలేదు: కేంద్రం
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో దుగరాజపట్నం పోర్టు కోసం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. దీనికి బదులుగా ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని మూలపోర్టుల్లో ఒకదానికి కేంద్ర నిధులు (Central Funds) సర్దుబాటు చేయాలని కోరింది. దీన్ని కేంద్రం తిరస్కరించింది. విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టును తీసుకురావటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రెండు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో అభివృద్ధి చేస్తోంది. దీని కోసం స్టేట్ బ్యాంకు నుంచి 2 వేల 500 కోట్ల రుణాన్ని తీసుకుంది.
సాగరమాల ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన అయెకాం సంస్థ పోర్టు నిర్మాణంపై ఇచ్చిన నివేదికలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల అవసరాలు తీర్చడానికి కొత్త పోర్టు ఉపయోగపడుతుందని పేర్కొంది. కడప, రాయచూర్ జిల్లాల్లోని థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టులకు బొగ్గు రవాణా చేయడానికి ఇది అనుకూలమని తెలిపింది. అంతేకాదు దీనివల్ల కృష్ణపట్నం, చెన్నై పోర్టులపై ఒత్తిడి కూడా తగ్గుతుందని వివరించింది. మొదటి దశ పోర్టు నిర్మాణానికి 2వేల 7 వందల 42 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఇందులో రైలు, రహదారి మార్గాల నిర్మాణానికి వెయ్యి 30 కోట్లు, భూసేకరణకు 2 వందల 70 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని పేర్కొంది.
దుగరాజపట్నం పోర్టు ఇప్పటిది కాదు. కొన్ని వందల ఏళ్ల కిందట ఇక్కడి నుంచి సరకు రవాణా కార్యకలాపాలు జరిగాయి. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం, తమిళనాడులో ఎన్నోర్ పోర్టులు అభివృద్ధి చెందాయి. వాటికి మధ్యలో మరో పోర్టు నిర్మిస్తే ఆ రెండింటి కార్యకలాపాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్టులో మెజారిటీ వాటాను అదానీ సంస్థ (Adani Company) దక్కించుకుంది. ఈ పోర్టు నుంచి ఏటా సుమారు 30 మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా జరుగుతోంది. ప్రస్తుతం కడప జిల్లాలోని జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఇక్కడి నుంచే బొగ్గు రవాణా అవుతోంది. విభజన చట్టంలో భాగంగా పోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలను తయారు చేసే బాధ్యతను కేంద్రం అప్పట్లో రైట్స్ సంస్థకు అప్పగించింది. దీనికి అయ్యే ఖర్చును విశాఖ పోర్టు ట్రస్టు భరించింది.
భారీ సరకు రవాణా నౌకల రాకపోకలకు ఇది అనువైన ప్రాంతంగా పేర్కొంది. తమిళనాడులోని ఎన్నోర్, విశాఖ పోర్టుల మాదిరే రవాణా కార్యకలాపాలకు అనువైన ప్రాంతమని రైట్స్ సంస్థ నివేదికలో పేర్కొంది. పోర్టు నిర్మాణం వల్ల శ్రీహరికోట విస్తరణ ఉపగ్రహాల ప్రయోగానికి ఇబ్బంది ఏర్పడుతుందని తొలుత అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పోర్టు నిర్మాణంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని షార్ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాతే దీని నిర్మాణంపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..