Theft in a Liquor Shop : అతడో పనిపై అక్కడకు వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక కావల్సినంత డబ్బుతో పాటు కోరిన మద్యం బ్రాండు కనిపించింది. ఇంకేముంది! వచ్చిన పని పూర్తి చేసి అక్కడే తాగుతూ కూర్చున్నాడు. మత్తులో మునిగిపోయి అక్కడి చిక్కుకుపోయాడు. ఇంతకీ అతడెవరు? వెళ్లిన పనేంటో తెలిస్తే మీరు నవ్వు ఆపుకోలేరంటే నమ్మండి!!
మద్యం వ్యసనం ఎంతటి వారినైనా నేలకు దించుతుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు విచక్షణ కోల్పోతుంటారు. తాము ఎక్కడ ఉన్నామో? ఏం చేస్తున్నామో కూడా వారికి స్ఫృహ ఉండదు. సరిగ్గా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. తేలు కుట్టిన దొంగ అన్నట్లుగా దోపిడీకి వచ్చిన ఓ యువకుడు తనకు తెలియకుండానే పోలీసులకు పట్టుబడడం విశేషం.
'ఫుల్‌గా తాగా.. దమ్ముంటే అరెస్ట్ చేయండి'.. పోలీసులకే సవాల్.. చివరకు...
మెదక్ జిల్లా నార్సింగిలో కనకదుర్గ మద్యం దుకాణం ఉంది. ఓ దొంగ ఆదివారం అర్ధరాత్రి దుకాణం పై కప్పు రేకులను తొలగించి లోపలికి వెళ్లాడు. క్యాష్ కౌంటర్లో నగదు జేబుల్లో పెట్టుకున్నాడు. తాను పట్టుబడకుండా సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్ కూడా తీసుకున్నాడు. ఇక మనకు అడ్డెవరు లేరులే! అన్నట్లుగా భావించి కనిపించిన సీసాలు తాగేశాడు. రా కొట్టేయడంతో మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారినా మత్తు దిగకపోవడంతో సోమవారం ఉదయం షాపు తెరిచిన యజమాని దొంగను గమనించి షాక్ అయ్యాడు.
చోరీ చేయడానికి వచ్చాడని తెలిసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని మద్యం మత్తులో ఉన్న దొంగను 108 వాహనంలో సమీపంలోని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే సదరు దొంగ రాత్రి వరకు స్పృహలోకి రాకపోవడం గమనార్హం. మత్తు నుంచి తేరుకోకపోవడంతో అతడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే వివరాలు తెలియరాలేదని ఎస్సై అహ్మద్ మొయినుద్దీన్ తెలిపారు.
చోరీ విషయమై మద్యం షాపు యజమాని పర్ష గౌడ్ మాట్లాడుతూ తాను ఆదివారం రాత్రి వైన్స్ మూసివేసి ఇంటికి వెళ్లానని తెలిపాడు. సోమవారం ఉదయం షాప్ ఓపెన్ చేసేసరికి ఓ దొంగ మద్యం తాగి సోయిలేకుండా పడిపోయి ఉన్నాడని చెప్పాడు. అర్ధరాత్రి సమయంలో వచ్చి ఉండొచ్చని, పై కప్పు రేకులు కట్ చేసి లోపలికి వచ్చారని వెల్లడించాడు. ఒక్కడే వచ్చాడా లేక మరికొందరు కలిసి వచ్చారా అనే విషయంపై అనుమానం ఉందని తెలిపాడు. షాప్‌లో సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్‌లు, డబ్బు, మద్యం సీసాలను సంచిలో మూట కట్టుకుని వెళ్లిపోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాడని, అతిగా మద్యం సేవించడం వల్ల స్పృహ కోల్పోయాడని తెలిపాడు. పోలీసులు విచారణ చేస్తున్నారని, దొంగ స్ఫృహలోకి రాకపోవడం వల్ల వివరాలు తెలియరావడం లేదని మద్యం దుకాణం జయమాని తెలిపారు.