Nellore District Review Meeting: నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశం వాడీవేడిగా జరిగింది. ఒక్క పనీ జరగడం లేదని, అధికారులు సహకరించడం లేదంటూ.. వైసీపీ ప్రజాప్రతినిధులే గళమెత్తారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపినా.. ఇప్పటికీ 30కి పైగా శాఖలు ప్రకాశం జిల్లా నుంచే పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి అన్నారు. పునర్విభజన సమస్యలు పరిష్కరించే వరకు జిల్లా సమీక్షా సమావేశాలకు తనను పిలవద్దన్నారు. అలాగే నియోజకవర్గంలో ఇళ్ల సమస్యలు, తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పత్తి, కంది, మినుము ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.
వెంకటగిరికి సంబంధించి చాలా సమస్యలు అధికారులకు చెబుతున్నా.. కనీసం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. డక్కిలి, మర్లపూడి ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల స్థలాలను ఆక్రమించుకుంటున్నా ఎలాంటి చర్యలు లేవన్నారు. రాపూరు సమీపంలోని మద్దెల మడుగు సర్కిల్‌లో రెండు జిల్లాలను కలిపే ప్రధాన రహదారి, గూడూరు-రాజంపేట రోడ్డు వర్షాలకు దెబ్బతిని మూడు అడుగుల్లోతుగోతులు ఏర్పడినా.. ఆర్ఎండ్బీ అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
నెల్లూరు నగరం, రూరల్ పరిధిలో సమస్యలు.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గట్టిగా గళమెత్తారు. భారీ లోడుతో ఇసుక లారీలు తిరగడం వల్ల కోడూరుపాడు, మునుమూడి, తాటిపర్తి రోడ్లు దెబ్బతిన్నాయని.. పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నెల్లూరు నగరంలో పైపులైన్ల నిర్మాణం కోసం చాలాచోట్ల రోడ్లు తవ్వి వదిలేశారని.. గత మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు తెలియజేసినా ఇప్పటివరకు పరిష్కారం కాలేదని ఆవేదన చెందారు.
బారా షాహీద్ దర్గా నిర్మాణానికి గతేడాది ఆగస్టులో సీఎం 15 కోట్లు కేటాయించినా.. ఇప్పటివరకు ఆర్థికపరమైన అనుమతి రాలేదన్నారు. దీని గురించి అడిగితే రావత్ దగ్గర ఆగిందంటున్నారని వాపోయారు. 40 వేల ఎకరాలకు నీరందించే కనుపూరు కెనాల్ డీప్ కట్ నిర్మాణానికీ ఆర్థిక అనుమతి రావట్లేదన్న ఆయన.. దీనిపై ఆర్థికశాఖ కార్యదర్శి రావత్‌ను కలిసేందుకు వెళితే కనీసం పట్టించుకోలేదన్నారు. జిల్లా సమీక్షా సమావేశానికి వైకాపా ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరుకాలేదు.
ఇవీ చదవండి: