TDP leaders are angry with YCP leaders: కందుకూరు దుర్ఘటనలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు మృతుల కుటుంబాలకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుపుకు అన్నం తినేవారు ఎవ్వరూ ఇలా చేయరని మండిపడ్డారు. కందుకూరు ఘటనను రాజకీయం చేయడానికి ఇంతకు దిగజారావా జగన్ మోహన్ రెడ్డి అంటూ అని విమర్శించారు. కార్యకర్తల్ని ఆదుకునే విషయంలో తెలుగుదేశంపై బురద చల్లితే, అది మీ ముఖాలపైనే పడుతుందని దుయ్యబట్టారు.
అనంతరం టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్. రాజు కందుకూరు దుర్ఘటనపై జరుగుతున్న తప్పుడు సమాచారాన్ని తీవ్రంగా ఖండించారు. కందుకూరులో జరిగిన దుర్ఘటన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించిన తీరు.. మానవత్వానికే మచ్చుతునక అని వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో మాన, ప్రాణాలు కోల్పోయిన ఆడబిడ్డల కుటుంబాలకు చంద్రబాబు అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాంటి మానవతావాదిపై దుష్ప్రచారం చేయడం జగన్ లాంటి కుసంస్కారికే సాధ్యమని ధ్వజమెత్తారు.
గత సంవత్సరం డిసెంబరు 29న తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి' అనే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరులో బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సభ వద్ద తొక్కిసలాట జరిగి.. ఇద్దరు మహిళలు సహా 8 మంది మృతి చెందారు. ఆ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులను ఆర్థిక సాయంగా అందించారు.
ఇవీ చదవండి