ఆంధ్రాలో నెల్లూరు నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అక్కడి జనాభా ఇప్పటికే ఎనిమిది లక్షలు దాటేసింది. సాంకేతిక విధానం ద్వారా ఓజోనేటెడ్ తాగునీటిని అందిస్తామని అధికారులు చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఫలితంగా కలుషిత నీరే అక్కడి ప్రజలకు దిక్కైంది. నగరంలోని 54డివిజన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి ఊరిస్తున్న "ఓజోనేటెడ్" కలగానే మిగిలింది.
దుర్వాసనతో.. పచ్చనీరు!
కాలనీల్లోని మంచినీటి కుళాయిల నుంచి పచ్చని నీరు వస్తోంది. పంపు సంపుల్లో మురుగు పేరుకుపోయి కనిపిస్తోంది. అక్కడక్కడా పైప్లైన్ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మురుగు నీటిలో కలుస్తోంది. కొన్నిచోట్ల నీటి గుంతల్లోనే పైప్లైన్ కనిపిస్తోంది. క్లోరినేషన్ సైతం అంతంతమాత్రంగానే చేస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది. దుర్వాసన వచ్చే నీటిని తాగేదెలా.. అనే ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతోంది.
మినరలే దిక్కు...
నగరంలోని శ్రామికనగర్, చాణుక్యపురి కాలనీ, గాంధీనగర్, వెంగళరావు నగర్, పొదలకూరు రోడ్డు, అంబాపురం, కొత్తూరు, రాజీవ్ నగర కాలనీల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కలుషిత నీటిని తాగలేక మినరల్ వాటర్ క్యాన్లు కొనుక్కొని తాగుతున్నారు. ఆర్థిక స్థోమత సరిపోని వారు మాత్రం వాటినే తాగుతూ... ఆస్పత్రుల పాలవుతున్నారు. అయితే ఈ మినరల్ వాటర్... ఎంతవరకూ శుద్ధ జలమనే ప్రశ్న నెల్లూరు వాసులను వేధిస్తూనే ఉంది.
రూ.500 కోట్లతో నిర్మిస్తున్న "శుద్ధజల పథకం" నాలుగేళ్లుగా కొనసా.... గుతూనే ఉంది. ఇది పూర్తవడానికి ఇంకెంత కాలం పడుతుందో..!
ఇదీ చదవండి:చనిపోయిన వారు బతికొస్తారక్కడ..!