Vigilance raids : ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని బూచిగా చూపి.. వంటనూనెల కృత్రిమ కొరత సృష్టించి.. ధరలు పెంచుతున్న వ్యాపారులపై.. విజిలెన్స్ అధికారుల దాడులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో వ్యాపారులు, ఆయిల్ సంస్థలు.. పాత నిల్వలకు ధరలు మార్చి.. మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు.. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డైకాయ్ ఆపరేషన్ చేస్తున్నారు. వివిధ శాఖల అధికారులు బృందాలుగా ఏర్పడి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట సహా పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు నూనెలు విక్రయిస్తున్నట్లు గుర్తించి.. పలువురు వ్యాపారులు, కొన్ని సంస్థలపై కేసులు నమోదు చేశారు.సుమారు 6 కోట్ల 30 లక్షల రూపాయల విలువచేసే.. వంట నూనె ప్యాకెట్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
గుంటూరులోనూ..
గుంటూరులోనూ.. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గుంటూరు, చినకాకాని, మంగళగిరి, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో... వంటనూనె గింజలు అక్రమంగా నిల్వచేసిన గోదాములపై అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ నిల్వల ద్వారా.. అధిక ధరలకు అమ్ముతున్న 15 దుకాణాలపై కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి : నూనె ధరలు పెంచితే కఠిన చర్యలు: విజిలెన్స్ డీఎస్పీ అశోక్ వర్ధన్