ఉత్తరాంధ్రలోని ఉద్దానం, కృష్ణా జిల్లాలోని A.కొండూరు ప్రాంతం మాదిరిగానే నెల్లూరు జిల్లాలోనూ కిడ్ని బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నాయుడుపేట మండలం వడ్డికండ్రిగలో గడపగడపకు బాధితులు ఉన్నారు. 100 ఇళ్లు కలిగిన ఆ చిన్న గ్రామంలో అందరూ వ్యవసాయ కూలీలే. కష్టపడి పనిచేసుకుని జీవనం సాగిస్తున్న వారి జీవితాల్లోకి శాపంలా వచ్చి చేరింది కిడ్నీ వ్యాధి. 4 ఏళ్లుగా చాపకింద నీరులా కిడ్నీ సమస్యలు ఊరంతా వ్యాపించాయి. ప్రస్తుతం అధికారికంగానే 40 మంది బాధితులు ఉండగా... మిగిలిన వారు వివిధ రకాల సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. గ్రామంలో ప్రతి నలుగురిలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు రోగులు తెలిపారు.
ఆస్పత్రి ఖర్చుల కోసం అయినకాడికి ఉన్న ఆస్తినంతా అమ్మేసుకుంటున్నారు. బంగారు ఆభరణాలు అమ్మి మందులు కొనుగోళ్లు చేస్తున్నారు. మరికొందరు అప్పులు చేసి ఆయుష్షు పెంచుకుంటున్నారు. ఒక్కొక్కరికి నెలకు సరాసరి 5 నుంచి 10వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. రోగులు ఇంటికే పరిమితమవుతుండటంతో... పూట గడవటమే కష్టంగా మారింది. గ్రామంలో ఉండే రిగ్‌బోర్ నీటిని తాగడం వల్లే కిడ్నీ సమస్యలు తలెత్తాయని స్థానికులు చెబుతున్నా... అధికారుల పరీక్షల్లో నీటిలో ఎలాంటి సమస్య లేదని తేల్చారు.
ఇదీ చదవండి: visakha steel: విశాఖ ఉక్కుపై గళమెత్తిన ఎంపీలు.. ప్రైవేటీకరణే ఉత్తమమన్న కేంద్రం