TDP Senior Leader Somireddy angry with CM Jagan: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. మూడవ రోజు (శుక్రవారం) తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు కాకినాడ జిల్లా అనపర్తిలో పర్యటించకుండా పోలీసులు అడ్డుపడ్డారు. మొదట పర్యటనకు అనుమతించిన పోలీసులు.. మధ్యాహ్న సమయానికి అనుమతిని నిరాకరిస్తూ.. దేవీచౌక్ సెంటర్‌కు పెద్ద ఎత్తున చేరుకుని జులుం ప్రదర్శించారు. బారికేడ్లతో సభా ప్రాంగణాన్ని దిగ్బంధించి.. దారికి అడ్డంగా బస్సులు నిలిపారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, వాహనాలు పెట్టి పోలీసులే రోడ్డుపై బైఠాయించారు. ఎందుకిలా చంద్రబాబు పర్యటనకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించిన కార్యకర్తలపై.. కర్కశంగా లాఠీచార్జీ చేశారు. ఆ తర్వాత మైకులను తొలగించి, లైట్లను ఆపేసి నానా రచ్చ చేశారు.
అనపర్తిలో పోలీసులు చంద్రబాబు పట్లు వ్యవహరించిన తీరుపై..టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడిందని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. జగ్గంపేట, పెద్దాపురంలో చంద్రబాబు నాయుడు సభలకు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేకే.. అనపర్తిలో అడ్డంకులు సృష్టించారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడే.. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోయేకాలం దగ్గరపడింది. చంద్రబాబు నాయుడిగారి సభలకు వచ్చిన స్పందనను జీర్ణించుకోలేకే.. అనపర్తిలో అడ్డంకులు సృష్టించారు. ఏపీలో నియంతృత్వ, నిరంకుశ పాలన సాగుతోంది. నియంతపాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి.. ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరపడింది.-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు
అనంతరం ఏపీలో నియంతృత్వ, నిరంకుశ పాలన సాగుతోందన్న సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. జగన్ రెడ్డి, షర్మిల, విజయమ్మ పాదయాత్రలు చేసినా, కార్యక్రమాలు నిర్వహించుకున్నా ఏనాడు అడ్డంకులు కల్పించలేదని సోమిరెడ్డి గుర్తు చేశారు. రోడ్లపై అడ్డంగా నిలబడి పీకే రాసిచ్చిన పచ్చి అబద్ధాలు, సొల్లు చెబుతున్నా టీడీపీ హయాంలో పోలీసులు వారిని అడ్డుకున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలో నియంతపాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి.. ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరపడిందని హెచ్చరించారు. సీనియర్ నాయకుడు చంద్రబాబునాయుడు ప్రజలనుద్దేశించి మాట్లాడానివ్వరా?.. ఏపీలో ప్రజస్వామ్యం చచ్చిందని సోమిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ప్రజాస్వామ్యం కోసం మరో స్వాతంత్య పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, ఇది చాలా బాధకరమని ఆయన ఆవేదన చెందారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి ఇలాంటి అరాచకాలకు పాల్పడకుండా ఆలోచన చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు.
ఇవీ చదవండి