CM Jagan is a Dalit traitor: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిన దళిత ద్రోహి జగన్ రెడ్డి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో నారా లోకేశ్‌ను రాపూరు మండలం జోరేపల్లి గ్రామస్థులు కలిశారు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. వెంకటగిరి, తిరుపతి వెళ్లాలంటే 17 కిలో మీటర్ల దూరం తిరిగి వెళ్తున్నామని, అటవీ ప్రాంతంలో 2 కిలో మీట్లర్ల రోడ్డుతో 10 గ్రామాల ప్రజలకు దూరం తగ్గుతుందని వెల్లడించారు. దీనిపై స్పందించిన లోకేశ్.. తాము అధికారంలోకి వచ్చాక వెంకటగిరి-సిద్ధవరం రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వంలో సంక్షేమం కోసం అమలుచేసిన 27 సంక్షేమ పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని లోకేశ్ కు వివరించారు. డప్పు కళాకారులకు తెలుగుదేశం ప్రభుత్వం తొలిసారిగా పెన్షన్ సౌకర్యం కల్పించిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. సంక్షేమ పథకాల మాటున ఎస్సీ కార్పొరేషన్ ను వైఎస్సార్సీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని... టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. జోరేపల్లి గ్రామస్తులు లోకేశ్‌ను కలిసి వారి సమస్యలను వివరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని లోకేశ్ ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వెంకటగిరి-సిద్ధవరం మధ్య అటవీప్రాంతంలో రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా రాత్రి డక్కిలిలో 1700 కి.మీ మైలురాయిని లోకేశ్ చేరుకోనున్నారు.
యువగళం పాదయాత్రకు మద్దతుగా.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు మద్దతుగా అరకులోయలో రాష్ట్ర ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దన్ను దొర ఆధ్వర్యంలో ఐదు కిలోమీటర్ల పాదయాత్ర పార్టీ అభిమానులు, టీడీపీ నాయకులు కార్యకర్తల నడుమ పాదయాత్ర కోలాహలంగా జరిగింది. ఐదు కిలోమీటర్ల మేర జరిగిన పాదయాత్రలో వేలాది మంది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ను సమూలంగా వ్యతిరేకిస్తున్న ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే పాదయాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. గిరిజన ప్రాంతంలో 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి వైఎస్సార్సీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చేరవేసి చైతన్య పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అరకులోయ నియోజకవర్గంలో సుమారు 100 రోజులు పాటు పేద ప్రజల సమస్యలను అధ్యయనం చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ పాదయాత్రకు సంఘీభావంగా నిర్వహిస్తున్న పాదయాత్రను ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఐదు కిలోమీటర్లు జరిగిన పాదయాత్రలో ఆరు మండలాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అభిమానుల సమక్షంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.