TDP Leader: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నెల్లూరు జిల్లాలో విదేశీ మహిళపై అత్యాచార యత్నం జరిగిన ఘటనలో కేసు నమోదైంది. ఈ కేసులో సాక్షిగా ఉన్న ఓ రైతు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. జిల్లాలోని సైదాపురం మండలం రాఘన్నరావుపురం గ్రామానికి చెందిన సిద్ధయ్య.. ఈ కేసులో సాక్షిగా ఉన్నారు. విదేశీ మహిళను రక్షించించిన సిద్ధయ్య.. ఆ ఘటనపై పోలీసులకు వివరించారు.
ఈ కేసు విషయమై సోమవారం సాయంత్రం సిద్ధయ్యను పోలీసులు తీసుకెళ్లారు. వాహనంలో ఎక్కించుకొని సైదాపురం, అటునుంచి గూడూరు.. రాత్రంతా వాహనంలో తిప్పుతూ చివరికి నెల్లూరు దిశా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే వాహనంలో రాత్రంతా తిప్పడంతో ఎమవుతుందో తెలియక సిద్ధయ్య తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాక్షిగా ఉన్న పాపానికి.. రాత్రంతా తిప్పిన తీరును చూసి పోలీసులు తనను ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారోని భయపడ్డానని సిద్ధయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయంపై ఇవాళ ఉదయం సిద్ధయ్య కుటుంబసభ్యులు తెలుగుదేశం నేతలకు సమాచారం ఇచ్చారు. వెంటనే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతోపాటు పలువురు తెదేపా నేతలు.. సిద్ధయ్యకు మద్దతుగా దిశ స్టేషన్కు వెళ్లి పోలీసులు ప్రశ్నించారు. అత్యాచారయత్నం కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని దొంగలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని పోలీసులను నిలదీశారు.
ఇదీ చదవండి: విదేశీ మహిళపై అత్యాచారయత్నం.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు