TDP Leaders Field Inspection in Saidapuram Mining: నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌పై పోరాటానికి సిద్ధమైన తెలుగుదేశం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సైదాపురంలో అనుమతులు లేకుండానే వైసీపీ ప్రజాప్రతినిధులు, అనుయాయులు తెల్లరాయిని దోచేస్తుంటే మైనింగ్‌ను పరిశీలించడానికి బయల్దేరిన తెలుగుదేశం నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ ఆపేశారు. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని కొందరు నాయకులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు.
Illegal mining: ఎన్జీటీ బృందానికి అడుగడుగునా అడ్డంకులు.. ముళ్ల కంచెలు వేసి.. కందకాలు తవ్వి
YCP MLA Anil Kumar Yadav Comments on Illegal Mining: నెల్లూరు జిల్లాలో తెల్లరాయి అక్రమ తవ్వకాలతో వైసీపీ నాయకులు, వారి అనుచరులు చెలరేగిపోతుంటే వారికి భద్రత కల్పించడమే తమ పని అన్నట్లు వ్యవహరిస్తున్నారు అక్కడి పోలీసులు. అక్రమ మైనింగ్ జరుగుతోందని ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవే ఆరోపణలు చేశారు. తెలుగుదేశం నాయకులే కొందరు వైసీపీ వారిని కలుపుకుని తవ్వుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. వీరికి స్థానిక పోలీసులు, అధికారులు అండగా ఉంటున్నారని నిందలు వేశారు. అయినా దీనిపై ఎలాంటి చర్యలు లేవని అన్నారు. అనిల్ కుమార్ ఆరోపణలపై స్పందించిన తెలుగుదేశం నాయకులు మైనింగ్ జరుగుతున్న సైదాపురం వద్దకు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
TDP leaders are Under House Arrest: పోలీసులు ముందుగానే ఆ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. కీలక నేతలను గృహ నిర్బంధం చేశారు. ఆనం రాంనారాయణరెడ్డిని ఇంట్లోనే నిర్బంధించే ప్రయత్నం చేయగా ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సహా పలువురు నాయకుల వాహనాలను దారిమధ్యలో అడ్డుకున్నారు. పోలీసు ఆంక్షలను ఛేదించుకుని కొందరు తెలుగుదేశం నాయకులు మైనింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. తెలుగుదేశం నాయకులపై అనిల్ కుమార్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తెల్లరాయి అక్రమ తవ్వకాలు జరుపుతున్న సైదాపురం మండలం తుమ్మలతలుపూరు సమీపానికి చేరుకున్న కోటంరెడ్డి వాహనానికి మైనింగ్ యంత్రాలను తరలిస్తున్న లారీ ఎదురైంది. వాహనాన్ని ఆపి లారీ డ్రైవర్‌తో ఆయన మాట్లాడారు.
Somireddy on Saidapuram Mining: తెలుగుదేశం నాయకులు సైదాపురం మైనింగ్ క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తున్నారని తెలుసుకుని అక్రమార్కులు మైనింగ్ యంత్రాలను ఆ ప్రాంతం నుంచి తరలించారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. సైదాపురం మండలంలో టీడీపీ బృందం పర్యటన ముందుగా తెలుసుకున్న వైసీపీ నాయకులు మిషన్లు అక్కడి నుంచి తొలగించి రోడ్లు మీద పెట్టారు. వైసీపీ నాయకుల అక్రమ రవాణాపై సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనింగ్ చట్టం ముఖ్యమంత్రి కాళ్ళ కింద నలిగిపోతుందని అన్నారు. లీజు అయిపోయిన మైన్లు రెన్యూవల్ చేయకుండా ఆపివేస్తున్నారని విమర్శించారు. మంత్రికి సంభందించిన వ్యక్తులే వచ్చి వారు చెప్పిన రేటుకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరిస్తున్నారని అన్నారు.