KNR SCHOOL: సమష్టి కృషితో నెల్లూరులోని కేఎన్ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో.. కేఎన్ఆర్ విద్యార్థిని తర్షశ్రీ 590 మార్కులు సాధించడంతో.. మరోసారి ఈ పాఠశాల పేరు మారుమోగిపోయింది. 580కి పైగా మార్కులను మరో ముగ్గురు విద్యార్థులు సాధించడం విశేషం. 2010లో సుధీర్ అనే విద్యార్థి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 582మార్కులతో సంచలనం సృష్టించాడు. అప్పటినుంచి ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్ కృషితో.. నేటికీ రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాలగా కేఎన్ఆర్ గుర్తింపు పొందింది.
ఈ ఫలితాల వెనక ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. విద్యార్థులకు పాఠాలను బట్టీ పట్టించే విధానంలో కాకుండా.. దాని సారాంశాన్ని పూర్తి స్థాయిలో విడమర్చి చెబుతారు. వెనకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మరింత ఆసక్తి ఉన్నవారిని గుర్తించి, ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్.. తన ఇంటి వద్దే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కూడా అదనపు తరగతులు నిర్వహిస్తారు. ఇది చదువులో రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వరుస ఫలితాలతో.. కేఎన్ఆర్ ఉన్నత పాఠశాల అంటే నమ్మకం, బ్రాండ్‌గా మారింది. అందుకే ఈ పాఠశాలలో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు పోటీ పడుతూ ఉంటారు. ఏటా నో అడ్మిషన్ బోర్డు పెడతారంటే.. ఈ పాఠశాలలో చేర్చడానికి ఉన్న పోటీని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చదివిన 67మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు. ర్యాంకులు తమ లక్ష్యం కాదని, సబ్జెక్టులో నిష్ణాతులుగా విద్యార్థులను తయారుచేస్తామని ప్రధానోపాధ్యాయుడు అంటున్నారు.
జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఉత్తమ ఆదర్శ ఉన్నత పాఠశాలగా గుర్తింపు తెచ్చుకున్న కేఎన్ఆర్ ప్రణాళికను.. అందరూ అనుసరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి మెరుగైన ఫలితాలు సాధిస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి మరింత మంది ఆసక్తి చూపుతారని అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి: