Daida Bilam Amaralingeswara Temple in Guthikonda: పూర్వకాలం నుంచి పూజలందుకుంటున్న ప్రసిద్ధ దేవాలయాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు కొండపైన, గుహల్లో, అరణ్యప్రాంతాల్లో ఉంటాయి. అలా ఒక కొండ గుహలో వెలసిందే దైద బిలం అమరలింగేశ్వర ఆలయం. ఇది గుంటూరు జిల్లా గుత్తికొండలో ఉంది. మరి ఈ ఆలయం విశేషాలు తెలుసుకుందామా!
చిమ్మచీకట్లోనే దేవదేవుడు: దైద బిలం అమరలింగేశ్వర ఆలయానికి ప్రత్యేకమైన విశేషం ఉంది. ఇక్కడ కొండగుహలోని చిమ్మచీకట్లోనే దీపం వెలుగులో దేవదేవుడు భక్తులకి దర్శనం ఇస్తారు. అందుకే ఈ దేవాలయాన్ని చీకటి మల్లయ్య ఆలయం అని కూడా పిలుస్తుంటారు. ఇది గుంటూరు జిల్లా గురజాల నుంచి 12 కిలోమీటర్ల దూరంలో, పులిపాడు, దైదా నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తికొండలో ఈ ఆలయం ఉంది. ఈ కొండగుహనే గుత్తికొండ బిలం అని కూడా పిలుస్తుంటారు. చుట్టూ పర్వతశ్రేణి, మధ్యలో బిల సముదాయం (గుహలు) ఉంటుంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బిలం. అమరలింగేశ్వరుడు ఉత్తరవాహినిగా ప్రవహించే కృష్ణా నది ఒడ్డున బిలంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయంలో శివుడు గుహలో స్వయంభువుగా వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు.
శివలింగం ప్రతిష్టించి మహాముని: ద్వాపరయుగంలో కాలయవనుని నుంచి తప్పించుకున్న శ్రీకృష్ణుడు ఈ బిలంలోకి వచ్చి అక్కడ తపస్సు చేస్తున్న మహర్షి పైన తన ఉత్తరీయాన్ని కప్పి వెళ్తాడు. అయితే ఆ మహర్షిని శ్రీకృష్ణుడిగా భావించిన రాక్షసుడు ఆ ముని తపస్సుకు భంగం కలిగిస్తాడు. దీంతో ఆగ్రహించిన ఆ మహర్షి రాక్షసుడిని భస్మం చేసినట్లు అక్కడి గ్రామస్తులు చెప్తుంటారు. పాపపరిహారార్థం ముచుకుంద మహాముని ఈ శివలింగాన్ని ప్రతిష్టించాడు అని కూడా అంటుంటారు.
స్వయంగా కుమారస్వామి ప్రతిష్టించిన మహిమాన్విత 'ఆత్మలింగం'! కార్తిక మాసంలో దర్శనం శ్రేష్ఠం!
లోపల 101 బిలాలు: ఈ బిలం ప్రధాన ద్వారం లోపలి వెళుతుండగా చీకటి మల్లయ్య పూజలందుకుంటూ కనిపిస్తాడు. ఇక్కడ ఉన్న ప్రధాన బిలం నుంచి లోపలికి వెళ్తే 101 బిలాలు(గుహలు) ఉన్నాయని చెబుతారు. అలానే ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ గరళం సేవించే శివుడి విగ్రహం ఉందని చెప్తుంటారు. అలానే ముందుకు వెళ్తుంటే నీటికొలను కనిపిస్తుంది. ఆ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. దైవ దర్శనానికి వచ్చిన భక్తులందరూ ఈ కొలనులో పుణ్యస్నానాలు చేస్తారు. కార్తికమాసంలో ప్రతి సోమవారం భక్తులు భారీగా వచ్చి కృష్ణా నదిలో స్నానాలు ఆచరించి అమరలింగేశ్వరుడిని భక్తులు దర్శించుకుంటారు.
ఎలా బయటపడిందంటే: బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెప్తుంటారు. 100 సంవత్సరాల కిందట పులిపాడు గ్రామస్థులు ఆ గుహ సమీపంలో పశువులు కాచుకుంటుండగా మంత్రోచ్చారణలు వినిపించాయని ఆ శబ్దం వచ్చిన దిశగా వెతకగా బండరాళ్ల మాటున బిలద్వారం కనపడిందని గ్రామస్థులు చెప్తుంటారు. ఈ క్రమంలో వారు బిలం లోపలికి ప్రవేశించగా అక్కడ వారికి దివ్యలింగాకారం కనబడిందని అంతే కాకుండా అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్లు కాడా గమనించారని అంటుంటారు. అప్పటి నుంచి అమరలింగేశ్వరస్వామిగా భక్తుల పూజలతో ఆ క్షేత్రం విరాజిల్లుతుంది.
ఎంతటి కోరికలైనా తీరతాయని నమ్మకం: అమరలింగేశ్వరస్వామిని దర్శించుకోవడం కష్టంతో కూడుకుంది. బిలం లోపల వందల మీటర్ల దూరంలో ఉన్నందున భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఇబ్బంది పడతారు. బిలం లోపకి వెళ్లటానికి, బయటకు రావటానికి వేరువేరు దారులు ఉన్నాయి. బిలం లోపలకి ప్రవేశించిన తరువాత 500 మీటర్ల దూరంలో స్వామివారు కొలువైన ప్రాంతానికి చేరుకుంటారు. బిలం లోపల నడక దారిలో ఇతర మార్గాలు కనపడతాయి. అవి శ్రీశైలం, కాశీ, ఎత్తిపోతల, గుత్తికొండ బిలం ప్రాంతాలకు వెళ్లే మార్గాలని ఇక్కడి ప్రజలు చెప్తుంటారు. కార్తికమాసంలో సోమవారం రోజు కృష్ణా నదిలో స్నానం చేసి తడిబట్టలతో ఆ లింగాకారుడిని తాకి, కృష్ణా జలాలతో అభిషేకించి, ఆ రాత్రి అక్కడ నిద్రిస్తే ఎంతటి కోరికలైనా తీరతాయని భక్తులు నమ్మకం. బిలంలో గర్భాలయం పైన ఆరిచెట్టు ఉంది. పిల్లలు లేనివారు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉయ్యాలకడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
దీపావళికి మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు - ఈ గుడి విశేషాలు మీకు తెలుసా ?
అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామిని ఒక్కసారి దర్శిస్తే చాలు- మీ ఇంట సకల సౌభాగ్యాలు!