Nadu Nedu Scheme: నెల్లూరు జిల్లాలో 1379 పాఠశాలల ఆధునికీకరణకు ప్రభుత్వం 467 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ నిధులతో 335 చోట్ల ప్రహరీలు, 914 పాఠశాలలకు తాగునీటి వసతి, 1,008 మరుగుదొడ్ల నిర్మాణం.. 2,001 అదనపు తరగతి గదులు, 904 పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉంది. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో ఆలస్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకూ సుమారు 93 కోట్ల రూపాయలతో 25 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్లో నిధుల లేమి కారణంగా.. అదనపు తరగతి గదుల నిర్మాణాలు కొన్నిచోట్ల పునాదుల వద్ద.. మరికొన్ని చోట్ల గోడల స్థాయిలో నిలిచిపోయాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే విద్యాసంవత్సరం నాటికైనా అదనపు తరగతి గదులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
తరగతి గదుల సమస్యతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో దెబ్బతిన్న గదుల్లోని పై పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి. దీంతో రేకులషెడ్లలోనూ.. చెట్ల నీడలోనూ చదువులు కొనసాగిస్తున్నారు. వీటికి తోడు విద్యుత్ సదుపాయం లేకపోవడం.. భోజనశాలలు, మరుగుదొడ్లు లేక ఎదుర్కొంటున్న సమస్యలు అదనమని విద్యార్థులు వాపోతున్నారు.
పాఠశాలల్లో మౌళిక వసతులు లేకపోవడంతో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. పేద విద్యార్ధులు, ప్రభుత్వ హాస్టల్స్లో ఉండే విద్యార్ధులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. అరకొర వసతులతో.. అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులు చదువుకోవాల్సి వస్తోందని.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పథకానికి నిధులు కేటాయించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
తరగతి గదుల సమస్యలతో విద్యార్ధులు చెట్లకింద ఎండల్లో కూర్చుంటున్నారు. దెబ్బతిని పైన పెచ్చులు ఊడి విద్యార్ధుల మీద పడుతున్నాయి. రేకుల షెడ్లలో తరగతులు నిర్వహిస్తున్నారు. దుమ్మూదూళి ఉన్న తరగతిగదుల్లో చదువుకుంటున్నారు. ఫ్యాన్లు లేక, విద్యుత్ లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరుగు దొడ్లు సరిపోక విద్యార్ధినిలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో మరుగుదొడ్లు సమస్యతీవ్రంగా ఉంది. చెట్ల కిందనే మధ్యాహ్న భోజనం తినడం వల్ల పురుగులు, ఆకులతో ఇబ్బందిగా ఉంది.-పద్మావతి, ప్రధానోపాధ్యాయురాలు
మా పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాలకు ప్రహారి గోడ, మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.-రవీంధ్రనాథ్, ప్రధానోపాధ్యాయుడు
మా పాఠశాల భవనాలు సరిగా లేవు పురాతన భవనాలు కావడంతో వర్షం పడితే ఎంతో ఇబ్బంది అవుతుంది. అందుకే చెట్లకింద కూర్చొని చదువుకోవాలసి వస్తుంది. అలాగే మరుగుదొడ్లు సౌకర్యం సరిగా లేదు కాబట్టి పాఠశాలను పునర్నిమించాలని కోరుతున్నాం. -ప్రియ, విద్యార్థిని
ఇవీ చదవండి: