నెల్లూరు నగరంలోని మూలపేటకు చెందిన షేక్ నజీర్ బాషా స్టేట్ బ్యాంక్ ఉద్యోగి. ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో భిక్షమయి గురూజీ వద్ద శిష్యుడిగా చేరారు. గురూజీ ఆశయాలు ఎంతో గొప్పవని...మతాలు అన్నీ ఒక్కటేనని ఆయన యోగా ద్వారా ఇచ్చిన సందేశం చాలా ఉన్నతంగా ఉందన్నారు బాషా. గురువుగారి ప్రభావంతో యోగాతోపాటు, భగవద్గీత సారాంశాన్ని ప్రచారం చేయడానికి నజీర్ బాషా కంకణం కట్టుకున్నారు.
ముస్లిం అయినా అన్నీ మతాలను గౌరవిస్తారు బాషా. భగవద్గీతలో ఎంతో గొప్పజ్ఞానం ఉందని చెబుతున్నారు. భిక్షమయి గురూజీ ఆశ్రమం నల్గొండ జిల్లాలో ఉంది. అక్కడ యోగాలో అనేక కోర్సులు చేశారు బాషా. బ్యాంకు ఉద్యోగం చేస్తూనే 2004 నుంచి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. యోగాలో అనేక శక్తులు ఉన్నాయని అంటున్నారు బాషా. విశ్వవ్యాప్తంగా యోగాను ప్రచారం చేసేందుకు 2010లో బ్యాంకు నుంచి రుణం తీసుకుని కేంద్రాన్ని నిర్మించారు. మారుమూల ప్రాంతాల్లోకి యోగా అభ్యసనం- భగవద్గీతం సారాంశం చేరాలంటారు.
ఉచితంగా యోగా..
2010లో మూలపేటలో పెద్ద భవనం నిర్మించి...ఉచితంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పదేళ్ళలో అనేకమందికి భగవద్గీత శ్లోకాలు నేర్పించారు. ప్రతి రోజు యోగాభ్యాసంపై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్ధుల చేత 700శ్లోకాలు కంఠస్తం చేయించారు. ప్రముఖుల జీవిత చరిత్రలు చదివేలా ప్రోత్సాహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని పిలుపునిస్తున్నారు బాషా.
నజీర్ బాషా చేస్తున్న ఉపన్యాసాలకు అనేకమంది ఆకర్షితులవుతున్నారు. తనకు వచ్చే ఆదాయంతోనే సమాజసేవ చేస్తూ....ఉచిత శిక్షణా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మతాలకు సంబంధం లేనిది యోగా అని అంటారు. భిక్షమయి గురూజీ ఆశయాలు గొప్పవని...మానసిక రుగ్మతలకు ధ్యానమే పరిష్కారమంటున్నారు బాషా. 2018లో గీతా వైభవం అనే ట్రస్ట్ ద్వారా సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: