రాష్ట్రవ్యాప్తంగా బంద్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. వెంకటగిరి, రాపూరు డిపోల బస్సులు నడవకపోవటంతో ప్రయాణికులు.. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బంద్ కారణంగా ప్రైవేటు విద్యాసంస్థలు, పలుచోట్ల ప్రభుత్వ పాఠశాలలు కూడా మూతపడ్డాయి.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఇచ్చిన పిలుపు మేరకు వామపక్షాలు, తెదేపా ఆధ్వర్యలో ఉదయగిరిలో బంద్ నిర్వహించారు. వీధుల్లో ప్రదర్శన చేసి భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. దుకాణాలు, పాఠశాలలు, కళాశాలలను మూసి వేయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని సీపీఎం నాయకుడు వెంకటయ్య, తెదేపా మండల కన్వీనర్ బయన్న ధ్వజమెత్తారు.
'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో ఎందరో త్యాగధనులు ప్రాణాలు అర్పించిన కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైందన్నారు. అలాంటి పరిశ్రమను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయటం దారుణమని మండిపడ్డారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నా... పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్లటం దుర్మార్గమైన చర్య అన్నారు. వ్యవసాయంతో పాటు అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణ త్యాగాలకు సిద్ధపడైనా స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. నాయుడుపేటలో నిరసన వ్యక్తం చేశారు. పడమర వీధి గాంధీ పార్కులోని విగ్రహం వద్ద తెదేపా నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. విశాఖ ఉక్కును ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించడం దారుణమన్నారు.
ఇదీ చదవండి: డిపోలకే పరిమితమైన బస్సులు.. ఎక్కడికక్కడ నిలిచిన ప్రజా రవాణా..