CHALO NELLORE: దళితుడైన ఉదయగిరి నారాయణది ఆత్మహత్య కాదు.. పోలీసుల హత్యేనంటూ.. తెలుగుదేశం పార్టీ గురువారం తలపెట్టిన ‘చలో నెల్లూరు’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. జిల్లాలోని నాయకులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ముఖ్య నాయకులను గృహ నిర్బంధం చేశారు. కొందరిని పోలీసుస్టేషన్‌కు తరలించి నిరసనలను అడ్డుకున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాసులరెడ్డిని గృహ నిర్బంధం చేయడంతో.. ఇళ్ల వద్దే వారు నిరసన తెలిపారు. ఉదయగిరి నారాయణ ఆత్మహత్యకు కారణమైన పోలీసులను శిక్షించకపోగా దళితుల పక్షాన నిలవాలని సంకల్పించిన వారిని గృహ నిర్బంధం చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఇంటి నుంచి బయలుదేరుతున్న నారాయణ భార్య పద్మ, ఎస్సీ నాయకులు ఎం.ఎస్.రాజు తదితరులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని అక్కడి నుంచి తరలించేందుకు యత్నించడంతో ఇంట్లోకి వెళ్లి గ్రిల్స్‌కు తాళాలు వేసుకున్నారు. అరెస్టులకు పాల్పడితే ఆత్మహత్య చేసుకునేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా నారాయణ భార్య పద్మ మాట్లాడుతూ.. తన భర్తను అన్యాయంగా దొంగతనం కేసులో పోలీసులు తీసుకువెళ్లారని, విచారణ పేరుతో ఎస్సై కరిముల్లా దారుణంగా కొట్టారని అన్నారు. పోలీసులే కొట్టిచంపి కందమూరు అడవుల్లో ఉరేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సైని వదిలే ప్రసక్తే లేదు: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
‘మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి రైట్‌హ్యాండ్‌గా వ్యవహరిస్తూ ఎస్సై కరిముల్లా అరాచకాలకు పాల్పడుతున్నారు’ అని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. నారాయణ మృతికి ఎస్సై కరిముల్లానే కారణమని ఆరోపించారు. తొలుత తన భర్త చావుకు ఎవరూ కారణం కాదని నారాయణ భార్యతో బలవంతంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారని.. తెదేపా పోరాటంతో నారాయణపై ఫిర్యాదు చేసిన వంశీనాయుడిపై కేసు నమోదు చేశారని సోమిరెడ్డి అన్నారు. ఎస్సై కరిముల్లా పేరు కేసులో లేకుండా చేశారని ఆరోపించారు. ఎస్సైపై ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, కోర్టులో కేసులు వేస్తామన్నారు.
ఇవీ చదవండి: