పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో మరోసారి వైకాపా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వరప్రసాదరావుపై వైకాపా రాష్ట్ర నాయకుడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. చిట్టమూరు మండలం మల్లాంలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం నూతన కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. నియోజకవర్గంలో అవినీతిపై పోరాటం చేస్తానని అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే సమావేశాలు పెట్టి తనపై విమర్శలు చేయటం తగదన్నారు.
మరోవైపు ముఖ్యమైన దేవస్థానాల పాలక వర్గాల్లో పేర్నాటి శ్యాంప్రసాద్ వర్గానికి చోటు దక్కుతోంది. గత నెలలో చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం నూతన పాలకవర్గంగా శ్యాంప్రసాద్ అనుచరులు బాధ్యతలు చేపట్టారు. చిట్టమూరు మండలం మల్లాంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం నూతన కమిటీ ఛైర్మన్గా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన చిల్లకూరు కోదండరామిరెడ్డి కూడా ఆయన అనుచరుడే. దీనిపై ఎమ్మెల్యే వర ప్రసాదరావు వర్గం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అలాగే మల్లాంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జిల్లా నేతల ఫొటోలు వేసి స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఫొటో వేయకుండా అవమానించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి