నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామానికి చెందిన నేలటూరు దేవదాసు, నేలటూరు పిచ్చమ్మ దంపతులకు మొత్తం ఏడుగురు సంతానం. వ్యవసాయ కూలిగా ఉంటున్న దేవదాసు తన శక్తి కొలది పిల్లలను పెంచి పెద్ద చేసి వారికి వివాహాలు చేశారు. పొంగూరు గ్రామంలోనే ఉంటున్న దేవదాసు దంపతులు లాక్ డౌన్ కు రెండు నెలలు ముందుగా చెన్నైలోని కుమారుని వద్దకు వెళ్లారు. చెన్నైలో ఉండగా మూత్ర సంబంధిత వ్యాధితో దేవదాసు అనారోగ్యం పాలయ్యాడు.
అతనికి వైద్య పరీక్షలు అందించేందుకు.. అక్కడ ఉన్న కుమారునికి అదే ప్రాంతంలో నివసిస్తున్న కుమార్తెకు భారంగా మారింది. దేవదాసును సొంత గ్రామానికి పంపించేందుకు నిర్ణయించుకుని గ్రామంలో ఉండే ఇతని రక్త సంబంధీకులు సమాచారం ఇచ్చారు...వాళ్లు అంగీకరించలేదు. తాతయ్య అమ్మమ్మ పడుతున్న బాధను చూడలేక చెన్నైలో ఉన్న మనవడు వెంకటేశ్వర్లు వీరిని కారులో తీసుకుని సొంత గ్రామం పొంగూరులో వదిలేందుకు బయలుదేరాడు. దేవదాసు దంపతులు వస్తున్న సమాచారాన్ని స్థానిక వీఆర్వో వాలంటీర్లకు చెప్పి... చెన్నై నుంచి వస్తున్నందున గ్రామానికి రావొద్దని.. ఆత్మకూరు వైద్యశాల వద్ద ఉండాలని చెప్పారు.
వారి మాటలు నమ్మి ఆత్మకూరు క్వారంటైన్ సెంటర్ లో దాదాపు మూడు గంటల పాటు నిరీక్షించినా... అధికారులు ఎవరు రాలేదు. ఊరికి తీసుకెళ్లేందుకు అయిన వాళ్ళు ఒప్పుకోని కారణంగా.. చెన్నైకు తీసుకుపోవడానికి వీలు లేక ఆత్మకూరులోని క్వారంటైన్ సెంటర్ వద్దే ఈ వృద్ధ దంపతులను వదిలి మనవడు వెంకటేశ్వర్లు తిరిగి చెన్నైకి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని వృద్థ దంపతులు తన మనవడు తప్పిపోయాడనుకుని... అతడి కోసం బైపాస్ రోడ్ సెంటర్ నుంచి రెండు కిలోమీటర్లు నడిచి ఆత్మకూరు చేరుకున్నారు. విషయం తెలుసుకుని స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ రెడ్డికి సమాచారం ఇవ్వగా.. ఈ వృద్ధ దంపతులను ఆత్మకూరు వైద్యశాలలో చేర్చారు.
ఇదీ చూడండి: