No Greenery on National Highways: జాతీయ రహదారులపై ఇరువైపులా.. డివైడర్లలో పచ్చని మొక్కలను చూస్తూ ప్రయాణం చేస్తుంటే మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది. అంతే కాకుండా పచ్చదనంతో పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. విశాలమైన రహదారుల్లో మొక్కలు, చెట్లు పెంచితే కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కానీ ఇందుకు భిన్నంగా నెల్లూరు మీదుగా వెళ్లే జాతీయ రహదారులు ఉన్నాయి.
ఆచరణకు సాధ్యమైనా పచ్చదనం పెంచాలనే ఆలోచన అధికారులలో కనిపించడం లేదు. అందుకు సాక్ష్యం నెల్లూరు మీదుగా వెళ్లే జాతీయ రహదారులు. విశాలమైన జాతీయ రహదారులపై అనేక చోట్ల చూద్దామన్నా మొక్క కనిపించదు. విశాలమైన జాతీయ రహదారులను చూస్తే అనేక ప్రాంతాల్లో పచ్చదనం మచ్చుకు కనిపించడం లేదు.
మొక్కలతో కళకళలాడేలా మారుద్దామనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. పచ్చదనం కాపాడటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమాన పాత్ర పోషించాలి. వీటి పర్యవేక్షణకు ప్రత్యేక జాతీయ, రాష్ట్ర రహదారుల శాఖలు ఉంటాయి. ఈ రెండు శాఖల ఆధ్వర్యంలో జాతీయ రహదారులను పర్యవేక్షణ చేస్తుంటారు.
చెన్నై రోడ్డులో సూళ్లూరుపేట నుంచి నెల్లూరు, ఒంగోలు, గుంటూరు వరకు కూడా 16వ నెంబర్ జాతీయ రహదారుల్లో పచ్చదనం కనుచూపు మేరలో కనిపించడం లేదు. అదేవిధంగా నెల్లూరు నుంచి సంగంవైపు 64వ నెంబర్ ముంబాయి జాతీయ రహదారి పోతుంది. నాలుగు జిల్లాల పరిధిలో సుమారు 200 కిలోమీటర్ల పొడవునా మొక్కలు ఎండిపోయి ఉన్నాయి. నెల్లూరు, కావలి, ఉలవపాడు మధ్య డివైడర్ గోడలు దెబ్బతిన్నాయి.
మొక్కలు పెంచడానికి వేసిన మట్టి కూడా నాణ్యతగా లేదు. మొక్కలు పెంచడం, వాటికి నీరు పోయడానికి కొందరు గుత్తేదారులను నియమించినా వారు పని చేయడం లేదు. నిధులు స్వాహా చేస్తున్నారే కానీ పట్టించుకోవడం లేదు. పర్యావరణాన్ని కాపాడేందుకు అధికారులు చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు.
అయిదేళ్లకు ముందు నెల్లూరు వైపు నుంచి వెళ్లే చెన్నై - కోల్‌కతా, ముంబాయి - చెన్నై జాతీయ రహదారుల్లో డివైడర్ల మధ్య గుబురుగా మొక్కలు ఉండేవి. చెట్లు, పూలమొక్కలతో అందంగా జాతీయ రహదారులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాత్రి సమయాల్లో డివైడర్‌కు ఇరువైపులా వెళ్లే వాహనాల లైట్లు పడి.. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు.
"మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని హైవేలపై అయితే.. పచ్చని చెట్లు, వాటికి పూసే పువ్వులతో ప్రయాణికులు ఫొటోలు తీసుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఇక్కడ చెట్లు లేవు. ఉన్న వాటిని కొట్టేస్తున్నారు. చెట్లు లేక వాహనాదారులు, కాలినడకన వచ్చేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు". - ప్రయాణికుడు
"టోల్ అయితే వసూలు చేస్తున్నారు కానీ మొక్కలు పెంచడం గురించి పట్టించుకోవడం లేదు. మొక్కలు పెంచితే బాగుంటుంది". - ప్రయాణికుడు