నెల్లూరు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో దాదాపు 2 లక్షల 50 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేయనున్నారు. మెట్ట ప్రాంతాల్లో మరో లక్ష ఎకరాల్లో అపరాలు సాగవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు యంత్ర పరికరాలు ఎంతో అవసరం. 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం రాయితీపై యంత్రాలు ఇవ్వని కారణంగా.. అన్నదాతలు బహిరంగ మార్కెట్లో వాటిని కొనాల్సి వస్తోంది. ఫలితంగా.. అధిక ధరలతో నష్టపోవాల్సి వస్తోంది.
2018వ సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో యంత్ర పరికరాల కోసం ప్రభుత్వం 56 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2019, 2020 సంవత్సరాల్లో యంత్ర పరికరాల కోసం డబ్బులు కేటాయించలేదు. చాలా మంది రైతులు ట్రాక్టర్లు, రోటవేటర్లు, స్ప్రేయర్లు, కల్టివేటర్, నాగళ్ళు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో వారికి బాగా ఖర్చవుతోంది. యంత్రాల కోసం వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి అడిగితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని చెప్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు.
యంత్ర పరికరాల రాయితీ విషయంపై జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు ఆనందకుమారిని వివరణ కోరగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ప్రస్తుతం ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ వారికి రాయితీపై యంత్రపరికరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. మిగతా రైతులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే యంత్రాలు అందిస్తామన్నారు.
ఇవీ చదవండి: