నెల్లూరు జీజీహెచ్‌లో వైద్య విద్యార్థినులపై వేధింపులు ఆగడం లేదు. కొందరు చదువు చెప్పే గురువులు.. అధికారులే.. ఈ దుశ్చర్యలకు పాల్పడటం విస్తుగొలుపుతోంది. రెండేళ్ల కిందట ఓ వైద్య విద్యార్థినితో ఓ అధ్యాపకుడు అసభ్యంగా మాట్లాడిన ఆడియో వెలుగుచూడటంతో ఆమె కుటుంబసభ్యులు ఆయనపై దాడి చేశారు. దీంతో అధ్యాపకుడిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించి.. విచారణ కమిటీ వేసింది.
ఆ ఘటన మరువక ముందే.. మరో కీచకుడు ఇంకో వైద్య విద్యార్థినిపై కన్నేశాడు. అందుకు సంబంధించిన ఆడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సదరు విద్యార్థిని.. ఆ వ్యక్తి వల్ల పడిన బాధను ఆ సంభాషణలో బయటపెట్టింది. 'నువ్వు నా సోల్‌మేట్.. లైఫ్ పార్ట్‌నర్.. వైజాగ్ కోడలయ్యేదానివి అంటూ మాట్లాడటం ఏమిటి సార్? నా వయస్సు 23 ఏళ్లు.. నాకు తెలిసి మీ పిల్లలకూ ఇదే వయస్సు ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నా... ఎందుకు ఫోన్ చేస్తున్నారు? రెస్టారెంట్లు, బీచ్‌కు రావాలని అడుగుతారా? నీ రూమ్‌లో ఏసీ లేదుగా.. నా రూముకు రా అని ఎలా పిలుస్తారు? ఏం మాటలవి సార్.. నేను మౌనంగా ఉన్నానని అనుకుంటున్నారా? మీ నంబరును బ్లాక్ చేస్తే.. మరో నంబరు నుంచి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు మానసికంగా వేధించడం వల్ల కొన్ని నెలలుగా పుస్తకాలు తెరవలేదు. విధులు నిర్వహించినా.. సంతకం పెట్టలేదు.. సార్' అంటూ తన పట్ల సదరు అధికారి ప్రవర్తించిన తీరును ఎంతో బాధతో చెప్పుకొచ్చింది. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ హరేంధిరప్రసాద్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
ఇదీ చదవండి:
FB friend requests: సోషల్‌గా వంచించి.. నైస్‌గా నమ్మించి.. అడ్డంగా దోచేస్తున్నారు!