విద్యకు చిరునామాగా నెల్లూరు జిల్లా మొన్నటి వరకు ఖ్యాతికెక్కింది. రాష్ట్రం, దేశంలోనే ఇక్కడి చదవులకు పేరుంది. సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు జిల్లాకు వచ్చి విద్యనభ్యసిస్తుంటారు. 2 రోజుల కిందట విడుదలైన ఇంటర్ ఫలితాలు చూస్తే.. ఇలా అయ్యిందేమిటి? అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విస్తుపోతున్నారు.
అయిదేళ్లుగా ఇంటర్ ద్వితీయ, ప్రథమ సంవత్సరాల్లో రెండో స్థానంలో నిలిచిన జిల్లా.. గత సంవత్సరం, ఈసారి ఒక మెట్టుకు కిందకు దిగింది. గతంలో ఇంటర్ ఫలితాల్లో ఇతర జిల్లాలు, రాష్ట్రాలతో పోటీ పడే జిల్లా ప్రతిష్ఠ.. ఈసారి మసకబారుతూ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత 63 శాతంతో అయిదో స్థానం, ద్వితీయ సంవత్సరంలో 68 శాతంతో మూడో స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. ఏటా ఓ మెట్టు పైకి ఎక్కుతూ తొలి స్థానంలో నిలవాల్సింది పోయి.. గత ఏడాది నిలిచిన స్థానానికే పరిమితమవడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
విద్యావేత్తలు, అధ్యాపకులు, జిల్లా ఇంటర్ బోర్డు అధికారులైతే ఈ ఫలితాలపై అన్ని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమీక్షించాల్సి ఉందని అంటున్నారు. పేరున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థలు ఎవరికి వారు ఈ ఫలితాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా బాలురుతో పోల్చితే బాలికలు కొంత మెరుగైన ఫలితాలు సాధించడం కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం. అదే కోవలో ఈ ఏడాది మొదటి సంవత్సర ఫలితాల్లో బాలురుకన్నా బాలికలు తమదైన ప్రతిభతో 66.82 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరంలో బాలురు 64 శాతం ఉత్తీర్ణులు కాగా బాలికలు 72.31 శాతం ఉత్తీర్ణతతో బాలికలు సత్తా చాటారు.
‘మున్సిపల్’లో ఉత్తమ ఫలితాలు
జిల్లాలోని నెల్లూరు నగరంలో రెండు మున్సిపల్ కళాశాలల్లో ఇంటర్ విద్యాబోధనలు చేపడుతున్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో నగరంలోని వీఆర్సీలో ఉన్న ఎంఆర్‌జేసీ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీలో 68 మంది, బైపీసీలో 15 మంది చొప్పున మొత్తం 83 మంది పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారని, ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ 98 మంది, బైపీసీలో 13 మంది మొత్తం 109 మంది పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపల్ అనురాధ తెలిపారు. జెండావీదిలోని పీఎన్‌ఎం మున్సిపల్ పాఠశాలలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ విద్యార్థులు 39 మంది పరీక్ష రాయగా 33 మంది ఉత్తీర్ణులయ్యారు. బైపీసీలో 24 మందికి 19 మంది, ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో 24 మందికి 22 మంది, బైపీసీలో 17 మందికి 15 మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. దాంతో మొదటి సంవత్సరంలో 82 శాతం, ద్వితీయ సంవత్సరంలో 90 శాతం ఉత్తీర్ణత నమోదైందని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ప్రభుత్వ కళాశాలలూ వెనుకంజే
రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశలో భాగంగా జూనియర్ ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, ఉచిత పాఠ్యపుస్తకాలు ఇలా అనేక పథకాలు అమలు చేస్తూ ఆయా కళాశాలల్లో కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. దీనికి తోడు ఏటా ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు సమకూర్చుతోంది. జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ఆశించిన మేర ఫలితాలు రాలేదు. జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు అందించిన వివరాల మేరకు ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి.
మొదటి సంవత్సర ఫలితాల్లో విడవలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 5.26 ఉత్తీర్ణతతో జిల్లాలో చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. ఇనమడుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల 51.22 శాతంతో జిల్లాలో మొదటి స్థానంలో నిలవగా.. రెండో స్థానంలో 43.72 శాతం ఉత్తీర్ణతతో నగరంలోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాల నిలిచింది. ఇక మూడో స్థానంలో 41.24 శాతం ఉత్తీర్ణతతో ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నిలిచింది.
ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అట్టడుగున తోటపల్లిగూడూరులోని ప్రభుత్వ కళాశాల నిలిచింది. ఈ ఫలితాల్లో జిల్లా మొదటి స్థానంలో 93.10 శాతంతో దగదర్తి కళాశాల, 57.30 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో డీకే ప్రభుత్వ మహిళా కళాశాల, 54.29 శాతం నమోదుతో వెంకటగిరిలోని జూనియర్ కళాశాలలు మూడోస్థానంలో నిలిచాయి.
త్వరలో బోర్డు అధికారుల సమీక్ష
వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా లేకపోవటంతో ఈ ఫలితాలపై మంగళ, బుధవారాల్లో జిల్లా బోర్డు అధికారులు ఆయా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమీక్షించనున్నారు. రానున్న విద్యా సంవత్సరానికి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక తయారు చేసుకోనున్నారు.
ఇవీ చదవండి...