కరోనా కారణంగా...యావత్ ప్రపంచం స్తంభించిపోయింది. విద్యాసంస్థలు అయితే నేటికి తెరుచుకోని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండటం కంటే... సేవా కార్యక్రమాల్లో పాల్గోనడమే మేలని నమ్మారు నెల్లూరు యువకులు.
నెల్లూరులో కొంతకాలంగా రెడ్‌క్రాస్ సంస్థ వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పుడు కరోనా వల్ల ఇంటికే పరిమితమైన యువ ఇంజినీర్లు, విద్యార్థులనూ ఒక్క చోటుకి చేర్చింది. పది మందిని ఒక్కొక్క బృందంగా ఏర్పాటు చేసి.. వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు చేపడుతోంది. అలా...నగరవ్యాప్తంగా పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీలో యువతను భాగస్వామ్యం చేస్తోంది.
నెల్లూరు నగరంలోని ప్రాంతీయ కొవిడ్ కేంద్రం- జీజీహెచ్.... నారాయణ కొవిడ్ కేంద్రాల్లో నిత్యం సేవలందిస్తున్నారు రెడ్‌క్రాస్ సభ్యులు. పాజిటివ్ వచ్చిన వారిని వార్డులకు చేర్చడం తగిన జాగ్రత్తలు చెప్పడం వంటివి చేస్తున్నారు. బాధితులకు అందే సౌకర్యాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ లోటుపాట్లు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.ఈ యువ బృందాల ద్వారా ఓపీ సేవల కోసం వచ్చే వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. వైద్యులకు.. రోగులకు సమన్వయ కర్తలుగా నిలుస్తున్నారు. కరోనా అనుమానితులకు.. ధైర్యం చెబుతూ నిర్ధరణ పరీక్షలు చేయించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు.
కరోనా వల్ల మరణించిన వారి.. మృతదేహాలను బంధువులకు దగ్గరుండి అప్పగిస్తున్నారు రెడ్‌క్రాస్ సభ్యులు. ఐసీఎమ్‌ఆర్ నిబంధనలు గురించి సమగ్రంగా వివరిస్తున్నారు. అంత్యక్రియల్లో ఎలాంటి అపోహలు లేకుండా పాల్గొనవచ్చని సూచిస్తున్నారు. సేవ కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో కొందరు రెడ్‌క్రాస్ సభ్యులు కూడా కరోనా బారిన పడ్డారు. కానీ మనోధైర్యంతో త్వరగా కోలుకుంటున్నారు. ప్లాస్మాదానం చేయడానికి ముందుకు వస్తున్నారు.
మనకెందుకులే అని కాకుండా... ఇది మన సమాజం అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న నెల్లూరు యువకులు మరెంతోమందిలో ఆలోచనను కలిగిస్తున్నారు.
ఇదీచదవండి