నెల్లూరు నగర పరిధిలో కరోనా కేసులు అధికమవడంతో కార్పొరేషన్ అధికారులు విస్తృత చర్యలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 32 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. జిల్లాలో ఎనిమిది పాజిటివ్ కేసులు నమోదు కాగా... 71 మంది రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. వీరంతా ఢిల్లీ మత ప్రార్థనలతో సంబంధం ఉన్న వారేనని కలెక్టర్ శేషగిరిబాబు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో జిల్లాలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించారు. లాక్ డౌన్ నిబంధనలను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నిత్యావసరాలు, వైద్యసేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఢిల్లీ మత ప్రార్థనలకు జిల్లా నుంచి 420 మంది వెళ్లినట్లు తెలుస్తోందని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. బాలాయపల్లి మండలంలో కరోనా పాజిటివ్ తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు . ప్రస్తుతం ఇంటింటి సర్వే జరుగుతోందని, సర్వే పూర్తి అయిన తర్వాత పూర్తిస్థాయి సమాచారం వస్తుందన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఓ కానిస్టేబుల్ కుమారుడికి పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో ఐసోలేషన్‌కు తరలించామన్నారు. ఆ స్టేషన్ సిబ్బందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచామన్నారు.. స్వీయ నిర్బంధంలో ఉంటే కరోనాను జయించవచ్చని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మూర్తి అన్నారు.