Nara Lokesh Meeting With Farmers In Yuvagalam : నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పడమటి నాయుడుపల్లిలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ముందుగా క్యాంప్ సైట్లో రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. నియోజవర్గంలోని రైతు నాయకులు పాల్గొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇరిగేషన్, వ్యవసాయ సమస్యలను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
లోకేశ్‌కు సమస్యలను వివరించిన రైతులు : వైఎస్సార్సీపీ నాలుగేళ్ల పాలనలో సోమశిల జలాశయాన్ని, కాలువలను ద్వంసం చేశారని, వ్యవసాయాన్ని కుదేలు చేశారని సమావేశంలో పాల్గొన్న రైతులు ఒక్కొక్కరుగా సమస్యలను లోకేశ్‌కి వివరించారు. సోమశిల జలాశయం ముంపు బాధితులకు న్యాయం చెయ్యలేదని, పరిహారం ఇవ్వడం లేదని, గ్రామాలను అభివృద్ది చెయ్యడం లేదని వివరించారు. హార్టికల్చర్‌కి ఎటువంటి ప్రోత్సాహం అందడం లేదని, టీడీపీ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేవారని గుర్తు చేశారు. మిరప రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సూక్ష్మ పోషకాలు కూడా ఇవ్వడం లేదని లోకేశ్‌కు రైతులు వివరించారు.
పొగాకు రైతులు నష్టపోతున్నారని, జగన్ పాలనలో మిర్చి రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతుందని రైతులు వారి కష్టాలను లోకేశ్‌కు చెప్పుకున్నారు. పత్తి రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నారు. దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు చెయ్యడం లేదని, కొన్న ధాన్యానికి డబ్బులు వెయ్యడం లేదని రైతులు వాపోయారు.
రైతులకు భరోసా ఇచ్చిన లోకేశ్ : రైతులు సమస్యలు తెలుసుకున్న అనంతరం రైతులతో మాట్లాడారు. రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తయారు చేయడమే టీడీపీ లక్ష్యమని.. అందుకోసం వ్యవసాయ, దాని అనుబంధ రంగాలతో పాటు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని లోకేశ్ తెలిపారు. దీని కోసం ప్రణాళికను రూపొందిస్తున్నామన్న ఆయన.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. సోమశిల హైలెవల్ కాలువ పనుల నిలిపివేతను రైతులు లోకేశ్‌తో ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పనులను ప్రారంభిస్తామన్న లోకేశ్... ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సీఎం జగన్ రైతులు లేని రాజ్యం తెచ్చాడని, రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలోనే నంబర్ 3వ స్థానంలో ఉందని లోకేశ్ అన్నారు. టీడీపీ హయాంలో ఒక్కో రైతుపై 75 వేల రూపాయలు అప్పు ఉంటే.. ఇప్పుడు జగన్ పాలనలో ఒక్కో రైతుపై 2.50 లక్షల రూపాయల అప్పు ఉందని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఆదుకోవడానికి ఏడాదికి 20 వేల రూపాయల ఇస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే టీడీపీ లక్ష్యంగా పేర్కొన్నారు. మామిడి, అరటి, దానిమ్మ, కర్జూరం, బొప్పాయి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేలా కంపెనీలతో ఒప్పందం చేసుకొని రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
'సోమశిల జలాశయం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వ్యవసాయాన్ని దాని అనుబంధ రంగాలతో పాటు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తాం. పెట్టుబడి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులను అన్న విధాలుగా ఆదుకుంటాం'- నారా లోకేశ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి