కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని చాలామంది భయంతో అంటరానివారిగా చూస్తున్నారు. మృతదేహాన్ని బంధువులు కూడా తీసుకువెళ్లటానికి నిరాకరిస్తున్నారు. ఖననం చేయడానికి గ్రామ, పట్టణ ప్రజలు అంగీకరించడంలేదు. కరోనా బాధితులంటే కనీస మానవత్వం కనిపించని పరిస్థితుల్లో... ముస్లిం యువకులు మేము ఉన్నామంటూ ముందుకు వచ్చారు. నెల్లూరు జిల్లాలో కరోనాతో మృతి చెందిన పలువురి మృతదేహాలను తీసుకువెళ్లి... శ్రద్దతో ఖననం చేస్తున్నారు. మొత్తంగా వంద మంది.. పది గ్రూపులుగా ఏర్పడి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరుకు.. ప్రశంసలు కురుస్తున్నాయి.
సేవా కార్యక్రమాలకు కులమత భేదం లేదు. మనసు ఉంటే చాలు అని వీరు నిరూపిస్తున్నారు.. వీరంతా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో పాజిటివ్ వచ్చిన బాధితుల ఇళ్లకు వెళ్లి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాల నిమిత్తం... నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ అనుమతి తీసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మీ ఆధ్వర్యంలో కరోనా మృతదేహాలను ఈ యువకులు స్వయంగా వచ్చి అంబులెన్స్ లో తీసుకువెళ్లి ఖననం చేస్తున్నారు.
నెల క్రితం వరకు అధికారులకు ఈ సమస్య తీవ్రంగా మారింది. బంధువులు తీసుకెళ్లకపోవడం... గ్రామాల్లో ప్రజలు రానివ్వకపోవటంతో... ముస్లిం యువత ముందుకొచ్చారు. పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు నిర్వహిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఆపద సమయాల్లో అదుకోవడమే తమ బాధ్యత అని ఆ యువకులు అంటున్నారు. మంచి పని చేస్తున్న తమను అల్లానే కాపాడతాడని విశ్వసిస్తున్నారు.
అంతిమ సంస్కారాలు తాము చేస్తామని అధికారులకు వీరు పేర్ల జాబితాను ఇచ్చారు. నెల్లూరు నగరం ఇసుకడొంకలోని ముస్లిం శ్మశాన వాటిక, బోడిగాడి తోటలోని హిందూ శ్మశాన వాటిక, క్రిస్టియన్ శ్మశాన వాటికల్లో ఇప్పటి వరకు 27మృత దేహాలను ఖననం చేశారు. ఇందులో సూళ్లూరుపేట, గూడూరు, బోగోలు, బుచ్చి, నెల్లూరు పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు ఉన్నాయి.
ఇదీ చదవండి:
'మంత్రికి చెప్పే చేస్తున్నాం.. నా జోలికి వస్తే శవాలు లేస్తాయి'