నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఏకవచనంతో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ ఖండించండి. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను అమలు చేస్తున్న కలెక్టర్, ఎస్పీలపై విమర్శలు చేయడమంటే ముఖ్యమంత్రిని విమర్శించినట్లేనని తెదేపా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి అన్నారు. తనకు కాకుండా జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారన్న అక్కసుతోనే ప్రసన్న ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
కలెక్టర్, ఎస్పీలు ఏసీ రూముల్లో కూర్చుని పాలన సాగిస్తున్నారని ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించడం అర్థరహితమని వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏసీ రూముల్లో కాకుండా ప్రజల్లోకి ఎప్పుడైనా వచ్చారా అని ప్రశ్నించారు. వైకాపా అంతర్గత రాజకీయాల కోసం కలెక్టర్, ఎస్పీలను బలి చేస్తున్నారని ఆరోపించారు. ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీకి క్షమాపణలు చెప్పాలని... లేకుంటే ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు.