నవంబర్ ఒకటి నుంచి పోలవరం పునర్నిర్మాణ పనులు చేపడతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి... పోలవరం టెండర్ల రద్దు కారణంగా పనులు ఆలస్యం అవుతాయన్న కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలపై స్పందించారు. పోలవరం నిర్మాణంలో అవకతవకలు, దోపిడీని నిర్మూలించేందుకు రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నామని వెల్లడించారు. వరదలతో సహజంగానే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పోలవరంలో ఎలాంటి పనులు జరగవని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ కల్లా ప్రభుత్వం చేయాల్సిన అన్ని ప్రక్రియలు పూర్తిచేసి నవంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామన్నారు. పోలవరంపై ఇచ్చిన నివేదికలో దాదాపు రెండు వేల కోట్లు తేడా వచ్చిందని మంత్రి అనిల్ చెప్పారు. పోలవరం నిర్మాణం విషయంలో ప్రతిపక్షాలు హడావుడి చేస్తున్నాయన్నారు. పరిస్థితిని ఉన్నతాధికారులు కేంద్రానికి వివరించారన్నారు. పారదర్శకంగా పనులు చేపట్టి 2021 ఆఖరికల్లా ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు.
ఇదీ చదవండి : హమీలేని రుణాలంటూ మోసం.. లబోదిబోమంటున్న బాధితులు