నెల్లూరు నగరానికి కొన్నేళ్ల కిందట విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వేలాది మంది కూలీలు వలస వచ్చారు. నగరం చుట్టు పక్కల 20వేల మందికిపైగా వలస కూలీలు నివాసాలు ఉంటూ.. స్థానికంగా ఉపాధిని పోందుతూ.. ఉండేవారు . కరోనా కారణంగా నేడు వీరంతా నగరంలోని పలు కూడళ్లలో పనుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది.
ఇసుక కొరతతో పనులకు ఆటంకం..
తెల్లవారు జామునే అన్నం క్యారేజిల్లో పెట్టుకుని భార్యాభర్తలు పనుల కోసం వస్తారు. నగరంలోని స్టోన్ హౌస్ పేట, కొండాయిపాలెం, అయ్యప్పస్వామి దేవాలయం వంటి కూడళ్లలో వేచి చూస్తే... మునుపు పనులు దొరికేవి. ఒక్కొక్కరికి రోజుకు 600రూపాయలు కూలీ లభించేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కేవలం 20శాతం మందికి మాత్రమే పనులు దొరుకుతున్నాయి. ఇసుక సమస్యతో భవన నిర్మాణ పనులు వేగంగా జరగడంలేదు. ప్రభుత్వం పనులు తక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఉపాధి లభించక... తిరిగి ఇళ్లకు కూడా వెళ్లలేని స్థితికి చేరుకున్నామని వాపోతున్నారు.
అద్దెలు చెల్లించలేకపోతున్నాం..
కరోనా కాలం కన్నా ... పరిస్థితులు కొంత మెరుగైనప్పటికీ అందరికీ పనులు లేవని ఆవేదన చెందుతున్నారు. వారంలో రెండురోజులు మాత్రమే పనుల్లోకి వెళ్తున్నామని అంటున్నారు. నగరంలో రోడ్లు, కాలువ పనులు కొన్ని మాత్రమే మొదలయ్యాయి. వర్షాలతో ఇసుక లేక బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు జరగడం లేదు. దీంతో పూట గడవటం కష్టంగా ఉందని... అద్దెలు చెల్లించలేక పోతున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు.
వేడుకకు వెళ్లలేక విచారం..
సంక్రాంతి పండుగకు శ్రీకాకుళం- విజయనగరం జిల్లాలకు వెళ్లడం వీరి ఆచారం. సొంతగ్రామాలకు వెళ్లి పిల్లలకు, తల్లితండ్రులకు బట్టలు పెట్టడం ఆచారంగా కొనసాగుతుందని అంటున్నారు. ఈ సారి గ్రామాలకు వెళ్లడానికి డబ్బులు లేవని... పండుగ ఎలా జరుపుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ...కమీషన్లు వచ్చే పనులపైనే కాదు.. కెమెరాలపైనా దృష్టి పెట్టండి: పవన్