నెల్లూరు నగరంలోని జగదీష్ నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌కు మొక్కలంటే పంచప్రాణాలు. 265 చదరపు గజాల ఇంటిలోనే 2000 మొక్కలు పెంచుతూ ఉద్యానవనంలా మార్చేశారు. దేశవిదేశాల నుంచి సైతం మొక్కలు తెప్పించుకుని అపురూపంగా చూసుకుంటున్నారు. విద్యాశాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నప్పటికీ మొక్కల పెంపకానికి రోజులో 5 గంటల సమయం కేటాయిస్తారు. 35 ఏళ్లుగా తమకు ఇది నిత్యకృత్యమని ఆయన అంటున్నారు.
మొక్కలకు దేశ విదేశాల నుంచి ఎరువులు
చంద్రశేఖర్ తన ఇంట్లో మొత్తం 200 రకాలు మొక్కలు పెంచుతున్నారు. నీటితామర, సువాసనలు వెదజల్లే అజేలియా పుష్పాలు, థాయిల్యాండ్, జపాన్, హవాయి ద్వీపాల నుంచి తెచ్చిన మెుక్కలు, ఎడారి మొక్కలు, మరుగుజ్జు చెట్లు ఇలా వివిధ రకాల మొక్కలతో ఇంటిని నింపేశారు. వీటిని సంరక్షించుకోవడానికి చంద్రశేఖర్ ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఆన్ లైన్ ద్వారా పోషక ఎరువులు తెప్పిస్తారు. కేరళ విధానంలో కొబ్బరి పొట్టు కలిపిన ఎరువులు వేస్తున్నారు. చంద్రశేఖర్‌తోపాటు ఆయన సతీమణి రాజేశ్వరీకీ మొక్కల పెంపకమంటే ఆసక్తి. వీరి పిల్లలు బెంగళూరులో ఉంటున్నారు. వీరు మాత్రం మొక్కలను వదిలి ఎక్కడికీ వెళ్లరు... అవే వీరికి ప్రాణం. మొక్కల కోసం 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. 10 వేల రూపాయల వరకు అద్దె వచ్చే పైఅంతస్తుని మొక్కల కోసం ఖాళీగా ఉంచారు. తన సోదరి హనుమాయమ్మ హైదరాబాద్‌లోని ఇంటిలో 10వేల మొక్కలు పెంచిందని... ఆమే తనకు ఆదర్శమని చంద్రశేఖర్ అంటున్నారు.
ఆరోగ్యం... ఆనందం
ప్రతి ఇంటిలో మొక్కలు పెంచితే కాలుష్యాన్ని నివారించవచ్చునని ఈ చంద్రశేఖర్ చెబుతున్నారు. ప్రతి రోజు పెరటిలో మొక్కల కోసం పనిచేస్తే ఆరోగ్యంతోపాటు, మానసికంగా ఆనందం కలుగుతుందని అంటున్నారు. ఎటువంటి వ్యాధుల్లేవని గర్వంగా చెబుతున్నారీ 58ఏళ్ల మొక్కల ప్రేమికుడు.