నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ప్రాంతంలో ఖాళీగా ఉన్న 2,140 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇండస్ట్రీయల్ సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమవుతోంది. ఇప్పటికే సేకరించిన భూముల్లో ప్రత్యేక పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేసి కేటాయింపులు చేపట్టారు. పారిశ్రామిక నడవాలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,448 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోగా- దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్నాయి. రహదారులు, విద్యుత్తు, నీరు, డ్రైనేజీ తదితరాలు సమకూర్చనున్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు త్వరితగతిన పరిశ్రమలు స్థాపించేలా సదుపాయాలు కల్పించనున్నారు.
ఉపాధి లక్ష్యంగా.. :
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక నడవాలను పట్టాలెక్కించింది. దీన్ని మన రాష్ట్రంలో విశాఖపట్నం నుంచి శ్రీకాళహస్తి వరకు విస్తరించింది. ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో కృష్ణపట్నం నోడ్ ఏర్పాటు చేసి భూములు అప్పగించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాల్సి ఉంది. ఈ వాడలో ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఆగ్రో, ఫుడ్, లెదర్, వస్త్ర పరిశ్రమలు స్థాపించేలా పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నారు. వారికి అనువుగా వసతులు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత కాగా- ఎస్పీవీ ద్వారా టెండర్లు పిలవనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక పనుల్లో కదలికలొచ్చే అవకాశముంది. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక, సదుపాయాల కల్పనకు భారీ ఎత్తున నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. నిర్ణీత గడువులోపు పనులు ప్రారంభమైతే.. మరో రెండేళ్లలో పరిశ్రమలు స్థాపించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రూ.2,139 కోట్ల పెట్టుబడులే లక్ష్యం
పారిశ్రామికవాడ ఏర్పాటు పూర్తయితే.. రాష్ట్రానికి రూ.2,139.44 కోట్లు పెట్టుబడులు వచ్చే వీలుందని అంచనా. రానున్న అయిదేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ నౌకాశ్రయం ఉండటంతో పరిశ్రమలు రావడం మరింత సులభమవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఉత్పత్తుల దిగుమతులు, ఎగుమతులకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కణ్నుంచి ఆయా రాష్ట్రాల రాజధానులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌కు ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవచ్ఛు అటు చెన్నై- బెంగళూరు, హైదరాబాద్- బెంగళూరు కారిడార్‌లోని పరిశ్రమలకు అనుసంధానంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
ప్రతిపాదనలకు ఆమోదం..
కృష్ణపట్నం ప్రాంతంలో ప్రత్యేక పర్పస్ వెహికల్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించనున్నాం. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా- మంగళవారం మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో ఆయా పనులకు టెండర్లు పిలవనున్నాం. - చంద్రశేఖర్, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, నెల్లూరు
ఇదీ చదవండి: