Excavating the Hill: ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో.. శిరసనంబేడు, కానూరు, రోషనూరు కొండలు ఉన్నాయి. 500ఎకరాల్లో కొండల చుట్టూ భారీ చెట్లు, అటవీ భూములు విస్తరించాయి. శిరసనంబేడు కొండపై ఉన్న శివాలయాల్లో ఏటా ఘనంగా తిరునాళ్లు నిర్వహించుకుంటారు. ఇప్పుడు వాటిపై అక్రమార్కుల కన్ను పడటంతో.. కొండలు పిండై పోతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా.. పొక్లెయిన్లతో తవ్వి వందలాది లారీల గ్రావెల్ తరలిస్తున్నారు.
కనీస నిబంధనలు పాటించకుండా.. పర్యవరణాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పటికి వరకు దాదాపు 200ఎకరాల్లో మట్టి తవ్వకాలు పూర్తిచేశారు. శివాలయాలు ఉన్న కొండలను పూర్తిగా ధ్వంసం చేశారు. జాతీయ రహదారి కోసం అనుమతిచ్చిన ప్రాంతంలోనే కాకుండా.. కొండపాదల వద్ద కూడా తవ్వేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు విచ్చలవిడిగా గ్రావెల్ దోచుకుంటూ డబ్బు చేసుకుంటున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని.. స్థానిక నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అక్రమర్కులతో స్థానిక నేతలు కుమ్మక్కై కొండల్ని పిండి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో గ్రావెల్ తవ్వకాలతో పర్యవరణం పూర్తిగా దెబ్బతింటోంది. మట్టి దోపిడీతో వర్షాకాలంలో కొండల నుంచి ప్రవహించే వాగులు కనుమరుగయ్యాయని స్థానికులు చెబుతున్నారు. నిత్యం లారీలతో గ్రావెల్ తరలింపు కారణంగా.. పంటపొలాలకు తీరని నష్టం జరుగుతోందని రైతులు వాపోతున్నారు.
"శిరసనంబేడు కొండ అంటే సింతలయ్య దేవుడికి ప్రసిద్ధి. ఏటా తిరునాళ్ల జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి కొండలను పిప్పి చేస్తున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ప్రకృతిని సర్వనాశనం చేసేస్తోంది". - నెలవల సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: