నెల్లూరు నగరంలోని మూలపేట బాలికల ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. బడిలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నగరం నడిబొడ్డులో ఉన్నందున తమ పిల్లలను ఇక్కడ చదివించడానికి ఒకప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపేవారు. గతంలో 400మంది విద్యార్థులున్న ఈ బడిలో ప్రస్తుతం 250మంది మాత్రమే చదువుతున్నారు. శిథిల భవనాలను చూసి పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. రోడ్డుకు పక్కనే ఉండటం వల్ల కాస్త వర్షం పడితే చాలు బురద బెడద పాఠశాలను వెంటాడుతోంది. 50ఏళ్ళనాటి భవనాలు కావడంతో అవి పూర్తిగా శిథిలమయ్యాయి. తరగతిలో బోధన సాగుతుంటే భవనంపై నుంచి పెచ్చులూడి పడుతున్నాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న గదుల మధ్య తరగతులు కొనసాగుతున్నాయి.
సదుపాయాలు దయనీయం..
పాఠశాల పరిస్థితి దయనీయంగా మారింది. గదులకు తుప్పుపట్టిన ఇనుపతీగలు తప్ప తలుపులు, కిటికీలు లేవు. విరిగిన రేకుల షెడ్లు కావడం వల్ల ఎండా, వానా గది లోపలికి ప్రవేశిస్తున్నాయి. తరగతి గది బైట పిచ్చిమొక్కలు పెరిగాయి. చెత్తా చెదారంతో బడి ఆవరణం అధ్వానంగా మారింది. 250మంది బాలికలకు కేవలం మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో నీటి సదుపాయం లేక నిరుపయోగంగా పడి ఉన్నాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థినులు ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే పాఠశాల మూతపడే పరిస్థితి ఎంతో దూరంలో కనిపించడం లేదు.
పునర్ వైభవం కావాలి
నాలుగేళ్ళ కిందట బడిలో మూడు నూతన భవనాలను నిర్మించారు. వాటిని కేవలం సమావేశాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. విద్యార్థులకు తరగతి గదులు లేవని తెలిసినా అధికారులు మాత్రం నూతన గదులను సమావేశాలకు వాడుకోవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్థానిక బాలికల పాఠశాల అభివృద్ధిపై దృష్టి పెట్టి పునర్ వైభవం తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.