నెల్లూరు జిల్లా వెంకటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాము ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ భవన నిర్మాణానికి 55 లక్షల రూపాయలతో... ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైద్య శాఖ అధికారులతో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ సమీక్షించారు. స్వీయ నియంత్రణ పాటించాలని అన్ని వర్గాలకు పిలుపునిచ్చారు.
నడికుడి - శ్రీకాళహస్తి రైలు మార్గాన్ని 4 దశల్లో పూర్తి చేయడానికి చేపట్టిన చర్యలతో పిడుగురాళ్ల వరకు పనులు జరిగాయని ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు అన్నారు. తాజాగా ఈ రైల్వే మార్గానికి కేంద్ర రైల్వే శాఖ నుంచి 270 కోట్ల రూపాయలను మంజూరు చేయించినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు 6 వరసల జాతీయ రహదారి నిర్మాణానికి రూ. 1,457 కోట్లు మంజూరయ్యాయని ఎంపీ పేర్కొన్నారు. వెంకటగిరి నుంచి గూడూరు రహదారికి రూ. 60 కోట్లు, నాయుడుపేట రహదారికి మరో రూ. 30 కోట్లతో ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: రైతుల నుంచి 30 శాతం పంట కొనుగోలు: సీఎం జగన్