నెల్లూరు జిల్లా సంగం హరిజన కాలనీ వద్ద పెన్నా నది పరివాహకం భారీగా కోతకు గురవుతోంది. 3 రోజులుగా ఆగకుండా ఒకవైపునకు కోత పడుతూనే ఉంది. కొత్తగా నిర్మిస్తున్న బ్యారేజీకి ఆనుకుని సుమారు 70 మీటర్లు ఎత్తులో మట్టికట్ట ఉండేది. కట్ట కింది భాగంలో ఇసుక ఎక్కువగా ఉన్నందున సోమశిల నుంచి వస్తున్న జల ప్రవాహానికి కొట్టుకుపోతోంది. దాదాపు 100 మీటర్లకుపైగా కోతపడింది. 250 మీటర్లు పొడవునా కట్ట పూర్తిగా దెబ్బతిన్నది. పక్కనే ఉన్న కాలనీ వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
ఎగువ నుంచి 40వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల కట్టకోతలకు గురైనట్లు ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. కట్ట కోతను ఆపేందుకు నీటిపారుదల అధికారులు ఇసుక బస్తాలు వేస్తున్నా... నీటి ప్రవాహానికి అవి నిలవడం లేదు. రాతి నిర్మాణం చేయాలని ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
భారీగా కట్టలు కోతకు గురవడం వల్ల మరమ్మతులు ఇప్పటిలో సాధ్యం అయ్యే పరిస్థితిలేదు. సోమశిల నీటి ప్రవాహం పూర్తిగా నిలిచినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.
ఇదీ చదవండి: డుడుమ జలాశయానికి వరద ప్రవాహం