గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు దారుణంగా ఉండేవనీ... ఇప్పుడు ఆ పరిస్థితులను మార్చామనీ సీఎం జగన్ అన్నారు. నెల్లూరులో అమ్మఒడి పథకం రెండో విడత నగదు బదిలీ చేసిన సీఎం.. విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్ర మాట్లాడుతూ.. ప్రతి పేదింటి బిడ్డ చదువుకు దూరం కాకుండా వారిని, మేనమామలా ఆదుకుంటానన్నారు.
అమ్మఒడి పథకం కింద.. వచ్చే ఏడాది నుంచి డబ్బులకు బదులు ల్యాప్‌టాప్‌లు అందించే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. తొమ్మిదో తరగతి దాటిన వారు, వసతి దీవెన లబ్ధిదారులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. దీని గురించి ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపినట్లు వివరించారు. ల్యాప్‌టాప్‌లో ఏదైనా సమస్య వస్తే.. సచివాలయంలో అందించిన ఏడు రోజులకు మరొకటి అందజేస్తామని తెలిపారు.
అక్కాచెల్లమ్మల కోసం అడుగులు వేస్తుంటే అడ్డుతగులుతున్నారంటూ ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని జగన్ ధ్వజమెత్తారు. దేవుడిపై ఎన్నడూ భక్తిలేని వారు.. నేడు కొత్త వేషం కడుతున్నారన్నారు. నిన్న గుడిలపై దాడులు చేశారు... రేపు బడులపై దాడులు చేస్తారేమోనని ఆరోపణలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి ఘాటుగా విమర్శించారు.
ఇదీ చదవండి: వ్యాక్సిన్ వేసుకొని మాస్కులు, శానిటైజర్ వాడితే కరోనా రాదా? : రెవెన్యూ ఉద్యోగుల సంఘం