భర్త నారాయణ మరణంపై.. "జై భీమ్" సినిమా తరహాలో పోరాడుతున్న దళిత మహిళ పద్మను "నెల్లూరు సినతల్లి"గా అభివర్ణించారు తెదేపా అధినేత చంద్రబాబు. న్యాయం కోసం ఆమె చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. బెదిరింపులకు బెదరక, ప్రలోభాలకు లొంగక.. భర్త ఉదయగిరి నారాయణ మృతిపై పద్మ చేస్తున్న పోరాటం "జైభీమ్" సినిమాలోని సినతల్లిని తలపిస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
పొదలకూరు ఎస్ఐ కరీముల్లా కొట్టడం వల్లనే తన భర్త చనిపోయాడని, నిందితులకు శిక్ష పడాలంటూ.. వ్యవస్థలకు, ప్రభుత్వానికి ఎదురు నిలిచి దళిత మహిళ చేస్తున్న పోరాటం అసామాన్యమని అన్నారు. దళితవర్గ పోరాటం.. జాతీయ ఎస్సీ కమిషన్ విచారణతో.. రాష్ట్ర ప్రభుత్వం కదలక తప్పలేదన్నారు. పద్మ కుటుంబానికి పరిహారంతో సరిపెట్టకుండా ఆమె భర్త మృతికి కారణమైన ప్రతి ఒక్కరిపైనా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
పద్మ పోరాటంలో అడుగడుగునా అండగా నిలిచిన దళిత సంఘాలకు, రాజకీయపార్టీల నేతలకు అభినందనలు తెలిపారు. దళితుడి హత్య కేసును నీరుగార్చేందుకు చేస్తున్న సిగ్గుమాలిన ప్రయత్నాన్ని ఇకనైనా కట్టిపెట్టాలని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు బిడ్డలు దిక్కులేనివారైన ఈ దారుణ ఘటనలో.. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :