కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీదే కాక సన్న, చిన్నకారు రైతులైన జీవాల పెంపకం, మారకం వంటి కార్యకలాపాలతో జీవనోపాధి పొందుతున్న రైతుల మీద పడింది. సాధారణంగా పల్లెల్లో సీజన్, సీజన్‌కి మధ్య కాలంలో సన్నజీవాలైన పొట్టేళ్లను కొనుగోలు చేసి... మరో సీజన్ ప్రారంభమయ్యేలోపు వాటిని మేపి ఆదాయానికి విక్రయిస్తారు. అదే ధోరణిలో పెద్ద జీవాలైన ఎద్దులను కొనుగోలు చేసి వ్యవసాయ పనులు పూర్తయిన తరువాత వాటిని విక్రయిస్తారు. ఇక పాడి పశువులను కూడా పాలు ఇచ్చినంత కాలం గేదెలు, ఆవులను ఉంచుకొని.. అనంతరం వాటికి మారకంగా మరో సూటి లేదా ఈనిన గేదెలను కొనుగోలు చేస్తుంటారు.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో సన్నజీవాల మండి ఉంది. మనుబోలు మండలంలో పాడిజీవాలైన గేదెల మండీలు రెండు ఉన్నాయి. ఒకటి మనుబోలు, మరొకటి మనుబోలు మండలంలోని కొండూరుసత్రం వద్ద ఉంది. ఈ మార్కెట్లు వారంలో ఒక రోజు నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం చిల్లకూరు మండలంలో సన్నజీవాల మండీ, ప్రతి బుధవారం మనుబోలు మండలంలోని రెండు చోట్ల మార్కెట్‌లో పశువుల సంత నిర్వహిస్తారు. ఈ రెండు మార్కెట్లకు రాష్ట్రంలోనే మంచి పేరు ఉంది. ఈ మార్కెట్‌లకు ఏడాదికి సెస్సుల రూపంలో రూ.46.5 లక్షలు వరకు ఆదాయం వచ్చేది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కరోనా నేపథ్యంలో మార్కెట్ నిర్వహించడం లేదు. దీంతో మూడు నెలల నుంచి మార్కెట్‌కు వచ్చే ఆదాయం పూర్తిగా లేకుండా పోయింది.
దీనావస్థలో వేలాది రైతులు
చిల్లకూరు మండలంలో నిర్వహించే సన్నజీవాల మార్కెట్‌కు ప్రతి శుక్రవారం వేల సంఖ్యలో రైతులు తీసుకువచ్చేవారు. మనుబోలు మార్కెట్‌కు గేదెలు, ఆవులు రైతులు తోలుకొచ్చి మార్కెట్‌లో విక్రయించేవారు. వీటి ద్వారా మార్కెట్‌కు నెలకు సెస్ రూపంలో సుమారు రూ. 3 లక్షల రాబడి వచ్చేది. అదే విధంగా మనుబోలు మండలంలోని మార్కెట్‌కు వందల సంఖ్యలో ఆవులు, గేదెలు విక్రయించేందుకు, కొనుగోలు చేసేందుకు వచ్చేవారు. తద్వారా సెస్ నెలకు సుమారు రూ. 30 వేల వరకు ఆదాయం వచ్చేది.
సన్నజీవాల రైతులు, కొనుగోలు దారులు, మధ్యవర్తులు ఇలా అందరితో వారంలో రెండు రోజులపాటు జనంతో కిటకిటలాడేవి. ఈ మార్కెట్‌లకు జిల్లా నలుమూలల నుంచి రైతులే కాకుండా దళారులు వచ్చేవారు. ఇతర రాష్ట్రాల నుంచి మాంసం విక్రయ దుకాణదారులు సన్నజీవాల కోసం వచ్చేవారు. ప్రస్తుతం మార్కెట్ లేకపోవడంతో మధ్యవర్తులకు, రైతులకు ఆదాయం లేకుండా పోయింది. జీవాల విక్రయాలకు సంతలు లేకపోవడంతో రైతులు ఆదాయానికి విక్రయించకుందాం అని పెంచుకున్న జీవాలను పంట మధ్య మేతలేక తమ గ్రామాల్లోనే వచ్చినకాడికి విక్రయించేస్తున్నారు.
సంతలు ఉన్న సమయంలో రూ. 500కు విక్రయించే పొట్టేళ్ల మాంసం ప్రస్తుతం సుమారు రూ. 900 నుంచి రూ.1000లకు విక్రయిస్తున్నారు. దీంతో మాంసాహారుల కుటుంబాలపై వారానికి రూ. 500 వరకు అదనపు భారం పడింది.
దుకాణం జరగడంలేదు - గురునాథం, వరగలిక్రాస్‌రోడ్డు, దుకాణం యజమాని
వారం వారం నిర్వహించే సన్నజీవాల సంత కారణంగా శుక్రవారం వచ్చే రాబడితో మరో వారం రోజులపాటు ఇబ్బంది లేకుండా ఉండేది. జీవాల సంత లేకపోవడంతో ప్రస్తుతం దుకాణం కూడా సక్రమంగా జరగడం లేదు.
జీవాలను మేపలేక ఇబ్బందులు - రవి, సన్నజీవాల వ్యాపారి
సంత ఉన్న సమయంలో సొంత వ్యవసాయ పనులు చేసుకుంటూనే జీవాల మార్పిడి వ్యాపారం చేసి రూ. 5 వేలు అదనంగా సంపాదించేవాడిని. సంతలేకపోవడంతో కొనుగోలు చేసిన జీవాలను మేపలేక ఇబ్బంది పడుతున్నాం. సంత ఉంటే మారుబేరాలకు విక్రయించి ఆదాయం గడించేవాళ్లం.
ఇవీ చదవండి: కరోనా ఎఫెక్ట్: పరిమితంగానే వినాయక విగ్రహాల తయారీ