తిరుపతి ఉప ఎన్నికల్లో రెండు లక్షల దొంగ ఓట్లు సృష్టించి, గెలుపొందేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. రెండు లక్షల ఓటర్ కార్డ్ ఐడీలు సృష్టిస్తున్నట్టు తమ వద్ద ఖచ్చితమైన సమాచారముందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి నెల్లూరులో తెలిపారు. ఉప ఎన్నికల్లో వాలంటరీ వ్యవస్థను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవహరించినట్లు, పార్లమెంట్ ఎన్నికల్లోనూ వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అన్నారు. దొంగ ఓట్లు, వాలంటరీ వ్యవస్థపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న ఆయన.. రాష్ట్రంలో పాలనంతా అవినీతిమయమైందని ధ్వజమెత్తారు.
'క్విడ్ ప్రో కో' విధానాన్ని అవలంభిస్తున్న వైకాపా..
ప్రతి పనిలో నీకెంత, నాకెంత అనే 'క్విడ్ ప్రో కో' విధానాన్ని అధికార పార్టీ అవలంబిస్తోందని ఆరోపించారు. ఇసుక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటంలోనూ క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్నామని ప్రభుత్వం చెప్పిందని.. 100 కోట్లు దాటిన టెండర్లను జ్యుడీషియల్ రివ్యూ కమిటీకి పంపుతామని సైతం చెప్పిందని గుర్తు చేశారు. కానీ.. ఇసుకలో ఆ విధానాన్ని ఎందుకు అమలుచేయండం లేదని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పంపిణీ, మద్యం అమ్మకాల్లోనూ క్విడ్ ప్రో కో కొనసాగుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తన ధోరణి మార్చుకోకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలే గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.
ఇదీ చదవండి: