రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మద్య నెలకొన్న ఘర్షణాత్మక ధోరణిపై భారతీయ జనతా పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు వర్గాలు ఈ విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ఆ పార్టీ ఏపీ అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి నెల్లూరులో అన్నారు. ఎస్ఈసీ, వైకాపా చర్చించుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరతగతిన జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అధికారులతో ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్‌ను.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రెండుసార్లు రద్దు చేయించడం సమంజసం కాదని హితవు పలికారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలన్న తెలుగుదేశం ప్రతిపాదన అర్థరహితమన్నారు.
ధాన్యం కొనుగోళ్ల అక్రమాలు:
నెల్లూరు జిల్లాలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై.. న్యాయ విచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. తేమశాతం పేరుతో 250 కేజీల వరకు అదనంగా ధాన్యం తీసుకోవడం వల్ల రైతుల నష్టపోయి.. మిల్లర్లు లబ్ధిపొందారని తెలిపారు. కొనుగోలు చేసి మూడు నెలలైనా.. రైతుల ఖాతాల్లో నగదు జమ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే.. రైతులు 'క్రాప్ హాలిడే'కి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
మైనింగ్‌లో అవినీతి:
సర్వేపల్లి నియోజకవర్గంలో వైకాపా, తెదేపా నేతలు చేస్తున్న పరస్పర విమర్శలపై.. ప్రభుత్వం విచారణ జరిపించాలని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభగిరిపట్నంలో మైనింగ్‌కు అనుమతిస్తే అడ్డుకున్న ఎమ్మెల్యే.. ఇప్పుడెలా ఒప్పుకున్నారని ప్రశ్నించారు. చారిత్రక కొండలను కొల్లగొట్టి.. సొమ్ము చేసుకున్నారని దుయ్యబట్టారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. జిల్లాకు తీసుకొచ్చిన అనేక భారీ ప్రాజెక్టుల భూసేకరణలోనూ అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు.
సోము వీర్రాజు రాక..
ఈ నెల 25న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మొదటిసారి జిల్లాకు వస్తున్నారని.. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు భరత్ కుమార్ తెలిపారు. ఆయనకు ఘనంగా స్వాగతం పలికి.. ఇక్కడ నెలకొన్న సమస్యలు, అధికార పార్టీ అనుసరిస్తున్న తీరును వివరిస్తామన్నారు.
ఇదీ చదవండి: భూములు కబ్జా చేశారని ఆరోపిస్తూ దళిత, గిరిజనుల ఆందోళన