Dolls replace the missing baby: ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన ఘటన నెల్లూరులో సంచలనంగా మారింది.. నగరంలోని ఆదిత్య నగర్ గుర్రాల మడుగు సంఘంలో ఏడాదిన్నర పసిబిడ్డ.. తల్లి పక్కనే ఉయ్యాలలో నిద్రిస్తుండగా దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లారి లేచి చూసేసరికి ఉయ్యాలలో పాప బదులు రెండు బొమ్మలు కనిపించడంతో తల్లి షాక్‌కు గురైంది. చుట్టుపక్కలా వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది.
గాలికోసం తలుపు తెరిస్తే.. : పోలీసుల కథనం ప్రకారం.. గుర్రాలమడుగు సంఘం నివాసి అనూషకు రాపూరు వాసి మణికంఠతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కృతిక, లక్ష్మీ హారికలు కుమార్తెలు ఉన్నారు. మణికంఠ హోటల్ నిర్వహిస్తుండగా, అనూష నగరంలోనే ఉంటూ ఎంసీఏ చదువుతోంది. భర్త మణికంఠ రాపూరు నుంచి అప్పుడప్పుడూ వచ్చి భార్యాపిల్లలను చూసి వెళుతుంటాడు. ఆదివారం అనూష తల్లి రాపూరులోని అల్లుడు వద్దకు వెళ్లింది. ఇద్దరు బిడ్డలతో అనూష పిన్ని ఇంటికి వెళ్లింది. లక్ష్మీ హారికను ఉయ్యాలలో వేసి.. పెద్ద కుమార్తె కృతికతో మంచంపై నిద్రించింది. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో అనూష లేచి చూసినప్పుడు చిన్న కూతురు లక్ష్మీ హారిక ఊయలలోనే నిద్రిస్తోంది. అదే సమయంలో కరెంట్ పోవడంతో ఉక్కపోత కారణంగా గాలి కోసం తలుపులు తీసి పడుకున్నారు. తెల్లవారిన తర్వాత 7 గంటల సమయంలో అనూష లేచి చూడగా.. ఉయ్యాలలో పాప లేదు.. పాప స్థానంలో రెండు బొమ్మలు కనిపించాయి. దీంతో ఆమె షాక్‌కు గురైంది.
ప్రత్యేక దర్యాప్తు బృందాలతో దర్యాప్తు..: అర్థరాత్రి వరకూ ఉయ్యాలలో ఉన్న చిన్నారి.. ఉదయానికి కనిపించకపోవడం.. పాప బదులు రెండు బొమ్మలు కనపడటంతో అనూష తల్లడిల్లిపోయింది. ఆందోళనకు గురైన అనూష.. బంధువులకు చెప్పడంతో వారంతా చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. తక్షణం రాపూరులోని భర్త, తల్లికి సమాచారం పంపింది. పాప అపహరణకు గురవడంతో ఆవేదన గురైన అనూష.. చివరకు పోలీసులను ఆశ్రయించింది. అనూష నుంచి ఫిర్యాదు అందగానే బాలాజీనగర్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. నగర డీఎస్పీ డి. శ్రీనివాసరెడ్డి, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ కె. రాములు నాయక్ గుర్రాలమడుగు సంఘంలోని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనూష నుంచి చిన్నారి లక్ష్మీ హారిక అపహరణపై వివరాలు సేకరించారు. ఈ సంఘటన సమాచారం అందుకున్న వెంటనే ఎస్పీ విజయారావు ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించారు.
సీసీ కెమెరాల పరిశీలన..: చిన్నారి అపహరణ సంఘటన ప్రాంతంలో వ్యక్తుల కదలికలు, ఆచూకీ రాబట్టడానికి సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఉయ్యాలలో నిద్రిస్తున్న పాపను అపహరించింది సొంతవారా.. ఎవరన్నది ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు రోజులవుతుండగా తన కూతురు చిన్నారి లక్ష్మీ హారిక ఆచూకీ లభించకపోవడంతో అనూష, ఆమె బంధువులూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి