నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు నగారా మోగింది. జూన్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. వైకాపా తరఫున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఐటీ, పరిశ్రమల మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగనుంది. దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలకు ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
ఏకగ్రీవ అవకాశాలు తక్కువే!
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి బరిలో దిగనున్నారు. ఆయన దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు. మృతుడి కుటుంబ సభ్యులే పోటీలో ఉన్నందున ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాలు తక్కువ. గతం నుంచి పాటిస్తున్న సంప్రదాయాన్నే ఈసారీ పాటించాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే తెదేపా పోటీ చేయకపోయినప్పటికీ.. వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశాలు తక్కువే. భాజపా సహా మరికొన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపే అవకాశం ఉన్నందున ఎన్నిక జరిగేందుకే ఎక్కువగా ఆస్కారం ఉంది.
ఇవీ చూడండి