నెల్లూరు నగరంలోని టైలర్స్ కాలనీలో మెుహసిన్ బేగం, భర్త సయ్యద్, కుమారుడు వలీ.. ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మెుహసిన్ బేగం పని చేస్తేనే ఆ ఇల్లు గడిచేది. రాత్రి, పగలు తేడా లేకుండా రోడ్డు మీద కూర్చుని బీడీలకు లేబుళ్లు అంటిస్తుంది. వెయ్యి లేబుళ్లు అంటిస్తే 15 రూపాయలు ఇస్తారు.
రోజుకు 60 రూపాయలు వచ్చేది గగనం. మరోవైపు.. ఒక్క రోజుకు రూ. 200 భర్త మందులకే ఖర్చుఅవుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త కిడ్నీ వ్యాధిని నయం చేయలేక.. కుమారుడికి బుద్ధి మాంధ్యం వ్యాధి తగ్గించలేక ఆ తల్లి పడే కష్టం చూస్తే కన్నీళ్లాగవు.
ఈమె కష్టానికి తోడు కుమారుడి పింఛను డబ్బులతో బతుకుబండిని లాక్కొస్తున్న తీరుపై.. లాక్ డౌన్ మోయలేని భారంవేసింది. చేసే ఆ కాస్త పనీ పోయింది. గత రెండు నెలలుగా ఇంటి అద్దె చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నామని మెుహసిన్ బేగం విచారం వ్యక్తం చేస్తోంది.
దాతలు ఎవరైనా ముందుకొచ్చి తమ కష్టాలు తీర్చాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు రుణసదుపాయం కల్పిస్తే చిన్న వ్యాపారం పెట్టుకుంటామని మెుహసిన్ బేగం తెలిపారు.
ఇదీ చూడండి: