No Transport Charges For Students: పేదల ప్రభుత్వమంటూ గొప్పలు.. పిల్లల చదువు బాధ్యత మేనమామగా తనదేనంటూ సీఎం జగన్ హామీలు.. సర్కార్ బడుల్లో అంతర్జాతీయ స్థాయి సిలబస్‌లంటూ ఆశలు.. ఈ తియ్యటి మాటల వెనక చేదు నిజాలను పరికించి చూస్తే మాత్రం.. ఎంతో మంది పేద పిల్లలు చదువుకు దూరమయ్యారు. పాఠశాలల విలీనం పేరిట వారిని చదువులకు దూరం చేశారు.ఇప్పుడు పిల్లల ప్రయాణ ఖర్చుల భారాన్నీ జగన్ సర్కార్ వదిలించేసుకుంది.
రూ.17కోట్లు చెల్లించాలి.. ఇప్పటివరకు ఒక్క పైసా కూడా: విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల ఇళ్లకు దగ్గరలోనే పాఠశాల ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే పిల్లల రవాణా ఛార్జీల కింద ఒక్కొక్కరికి నెలకు 600 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం వాటా కింద 60 శాతం నిధులిస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 40 శాతం కలిపి అర్హులకు అందించాలి. సర్వశిక్ష అభియాన్ లెక్క ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 29 వేల మంది విద్యార్థులు.. నిర్ణీత దూరంకన్నా ఎక్కువ దూరం నుంచి పాఠశాలలకు వస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వీరికి 17 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ జగన్ ప్రభుత్వం ఒక్క పైసా విదల్చలేదు.
విద్యాహక్కు చట్టం నిబంధనలనే మార్చిన జగన్ సర్కార్: నిబంధనల ప్రకారం కేంద్రం సకాలంలోనే తన వాటా నిధులను ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వాటా డబ్బులు ఇవ్వడం లేదు సరికదా.. కేంద్రం ఇచ్చిన నిధులను సైతం ఇతర అవసరాలకు మళ్లిస్తోందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన రవాణా ఛార్జీలను ఎగ్గొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా విద్యాహక్కు చట్టంలోని నిబంధనలనే మార్చేసింది. ‘ఆవాసాల నుంచి పాఠశాలల దూరం’ అన్న నిబంధనను సవరించేసింది.
బడుల విలీనంతో విద్యార్థుల ఇళ్లకు పాఠశాలల మధ్య దూరం బాగా పెరిగిపోయింది. వీరి రవాణా ఛార్జీలను తప్పించుకునేందుకు.. దూరం నిబంధనలను ప్రభుత్వం మూడింతలు చేసింది. ప్రీ హైస్కూలు, హైస్కూలు విద్యార్థులు కనీసం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చంటూ కొత్త నిబంధన చేర్చింది. ఈ లెక్కన 3, 4, 5 తరగతుల విద్యార్థులకు పాఠశాల మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నా రవాణా ఛార్జీలు చెల్లించరు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో కొంతమంది విద్యార్థులు ఆరో తరగతి చదివేందుకు నది దాటి వెళ్లాలి. ఏజెన్సీ ప్రాంతంలో చాలాచోట్ల ఆవాసాలకు సమీపంలో బడులు లేక వాగులు, వంకలు దాటుకొని వెళ్తున్నారు. ఇలా విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నా.. వారికి ఇవ్వాల్సిన ఛార్జీల విషయంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది.