TDP leader Shatrucharla Vijayaramaraju fire on CM Jagan: రాష్ట్రంలో మరికొన్ని నెలల్లోనే మంచి రోజులు రాబోతున్నాయని.. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి, పూర్తిగా అంతరించిపోతుందన్నారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే కురుపాం నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సీఎం జగన్‌పై శత్రుచర్ల ఆగ్రహం.. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలోని తన నివాసంలో టీడీపీ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిన్న (బుధవారం) కురుపాంలో జరిగన 'జగనన్న అమ్మ ఒడి' కార్యక్రమంపై, ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలపై విజయరామరాజు సంచలన వ్యాఖ్యలు. కురుపాం నియోజకవర్గ పరిధిలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను జగన్ ప్రభుత్వం విస్మరించడం శోచనీయమన్నారు. నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో గత కొన్నేళ్లుగా ఏనుగుల బెడద తీవ్రంగా వేధిస్తోన్న ముఖ్యమంత్రి జగన్.. ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పలువురు రైతులు పంట నష్టంతో ప్రాణాలు కోల్పోతే.. జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం తెచ్చిన పలు జీవోలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమని ఆగ్రహించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయం.. అనంతరం ఇటీవలే కురుపాం నియోజకవర్గంలో పలువురు గర్భిణులు ప్రాణాలు కోల్పోతే, సీఎం జగన్ ఎందుకు పట్టించుకోలేదు..? అని శత్రుచర్ల విజయరామరాజు నిలదీశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని.. ఈ రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పూర్తి చేస్తానని.. చేయని పక్షంలో రాజకీయల నుంచి తాను వైదొలుగుతానని శత్రుచర్ల విజయరామరాజు సవాల్ విసిరారు. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలు..వైఎస్సార్సీపీ, జగన్ చేస్తున్న అన్యాయాలను, విధ్వంసాలను దృష్టిలో ఉంచుకుని.. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుని నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకుందామని పిలుపునిచ్చారు.
అమ్మఒడి కార్యక్రమం ఓ పరాకాష్ట.. కురుపాలెంలో నిన్న జరిగిన అమ్మఒడి కార్యక్రమం జగన్ ప్రభుత్వానికి ఓ పరాకాష్ట అని.. శత్రుచర్ల విజయరామరాజు వ్యాఖ్యానించారు. సమావేశంలో నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై మాట్లాడకుండా.. ప్రతిపక్ష నాయకులపై సీఎం జగన్ వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు. పలు మండలాల్లో ఏనుగుల దాడుల వల్ల 10 నుంచి 11 మంది చనిపోయారని.. ఇంతవరకూ ఈ జగన్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించలేదని ఆగ్రహించారు. నియోజకవర్గంలో ఉన్న నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఆధ్వర్యంలో దాదాపు పది సమావేశాలు నిర్వహించి.. అధికారులకు వినతిపత్రాలను అందజేశామన్నారు. అయినా కూడా ఇప్పటివరకూ వారి నుంచి గానీ ప్రభుత్వం నుంచి గానీ ఎటువంటి స్పందన లేదని విజయరామరాజు దుయ్యబట్టారు.