Protest from the farmers to the Collector: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కు.. ధాన్యం రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. వీరఘట్టం మండలం చలివెంద్రిలో ఈ ఘటన జరిగింది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కారుని ధాన్యం బస్తాలతో రైతులు అడ్డుకున్నారు. ఆ గ్రామ సచివాలయం తనిఖీ కోసం కలెక్టర్ నిశాంత్ కుమార్ వెళ్తుండగా.. గ్రామానికి చెందిన ధాన్యం రైతులు అడ్డుకున్నారు. కలెక్టర్ పయనిస్తున్న మార్గానికి అడ్డుగా ధాన్యం బస్తాలు వేసి.. కలెక్టర్ మా సమస్యకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గ్రామంలో ఇప్పటికీ రెండు వేల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం మిగిలిపోయిందని రైతులు తెలిపారు.. ధాన్యం సేకరణ లక్ష్యం పూర్తయిందని రైతు భరోసా కేంద్రం అధికారులు చెబుతున్నారన్నారు. తమ సమస్యను అధికారులు, ప్రజా ప్రతినిధులు పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగులు ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమాధానం చెప్పాలని రైతులు భీష్మించారు. దీంతో.. గ్రామ సచివాలయం వద్దకు రావాలని.. తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా రైతులకు కలెక్టర్ తెలియచేశారు.
దీంతో రైతులు బస్తాలు అడ్డు తొలగించి గ్రామ సచివాలయానికి చేరుకున్నారు. అయితే.. కలెక్టర్ నిశాంత్ కుమార్ సచివాలయం నుంచి వెళ్లిపోయిన తర్వాత.. రైతులు సచివాలయ కార్యాలయానికి తాళం వేశారు. తమ సమస్యపై కలెక్టర్ సరైన వివరణ ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా దురుసుగా వ్యవహరించారని రైతులు వాపోయారు.
వీరఘట్టం మండలం చలివెంద్రి మేజర్ పంచాయతీ అయిన మా గ్రామానికి ఈ రోజు కలెక్టర్ గారు విచ్చేయుచున్నారని.. రైతులందరమూ మా ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలియజేస్తున్నాము. ధాన్యం బస్తాలను పెట్టి కలెక్టర్ గారిని.. చుడండని అందామనుకుంటే.. ఆయనకు కోపమొచ్చి మమ్మల్ని సచివాలయం వద్దకు తీసుకువెళ్లి తిట్టడం జరిగింది. ఈ రకంగా రైతుల్ని తిట్టడం చాలా ఆవేదన చెందుతున్నాం. మళ్లి మా మీద బెయిల్ రాకుండా కేసులు పెడతాం అన్నారు. జిల్లా అధికారే అలా అంటే.. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి.. మాకు న్యాయం ఎలా జరుగుతుంది.- శ్రీనివాసరావు, రైతు
వీరఘట్టం పీఎస్‌లో కేసు నమోదు: విధులలో ఉన్న ప్రభుత్వ అధికారిని అడ్డుకుని పనికి ఆటంకం కలిగించి.. ఆందోళన చేసినందుకు.. 14 మంది రైతులపై వీరఘట్టం పీఎస్‌లో కేసు నమోదైంది. ధాన్యం కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ కారును అడ్డుకోవడంతో ఆగ్రహానికి గురైన కలెక్టర్ వారిపై కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: